అచ్చ‌న్న మ‌న‌సు వెన్న‌.. చేత‌లు మిన్న‌

టీడీపీ నాయ‌కుడు శ్రీకాకుళం జిల్లా టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, మంత్రి కింజ‌రాపు అచ్చ‌న్నాయుడు. త‌న‌కు తానే ప్ర‌త్యేకం గా సృష్టించుకున్న రాజ‌కీయ వేదిక‌పై ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండే నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. వాస్త‌వానికి ఆయ‌న సోద‌రుడు, దివంగ‌త కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు హ‌ఠాన్మ‌ర‌ణంతో ఏర్ప‌డిన రాజ‌కీయ శూన్య‌త‌ను త‌న‌దైన శైలితో పూర్తి చేయ‌డంలో అచ్చ‌న్నాయుడు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోతార‌నే పేరు సంపాయించుకు న్నారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ 1994లో టెక్క‌లి నుంచి గెలిచి 40 వేల ఓట్ల మెజారిటీతో చ‌రిత్ర‌ సృష్టించా రు. తొలుత ఓట‌మి ఎదురైనా కుంగిపోకుండా ప్ర‌య‌త్నాలు సాగించి ఫ‌లితం సొంతం చేసుకున్నారు.

అంద‌రికీ అన్న‌గా!
పేరులోనే అచ్చ‌న్న అని ఉండ‌డం కాదు, ఆయ‌న చేత‌లు కూడా, ప‌దిమందినీ క‌లుపుకొని పోవ‌డంలో కూడా పెద్ద‌న్నగా వ్య‌వ‌హ‌రించారు అచ్చ‌న్నాయుడు. ప్రతి స‌మ‌స్య‌పైనా త‌న‌దైన స్థాయిలో అధ్య‌య‌నం, వివ‌రాలు తెలుసుకోవ‌డం, గ‌ణాకాల‌ను ముందుగానే సేక‌రించ‌డం, ప్ర‌తి విమ‌ర్శ‌కు ప‌దునైన దాడితో అరిక‌ట్ట‌డం వంటివి అచ్చ‌న్న‌కు క‌లిసి వ‌చ్చిన అంశాలు. టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఆయ‌న అలుపెరుగ‌ని కృషి చేశారు. ద‌శాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఈ నియోజ‌క‌వ‌ర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ఇక్క‌డి మ‌త్స్య కార వర్గానికి అనేక రూపాల్లో సాయం చేశారు. ప్ర‌ధాన ర‌హ‌దారుల‌ను విస్త‌రించ‌డంతోపాటు ఇక్క‌డ‌, సాగు, తాగు నీటికి ఎక్కువ ప్రాదాన్యం ఇచ్చారు.

మంత్రిగా త‌న దైన ముద్ర‌!
2014లో అచ్చ‌న్నాయుడు టెక్క‌లి నుంచి గెలిచిన వెంట‌నే టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆయ‌న‌కు కేబినెట్‌లో బెర్త్ కల్పించారు. తొలుత కార్మిక శాఖ మంత్రిగా ప‌నిచేసిన అచ్చ‌న్న‌.. త‌న‌దైన శైలిలో ముందుకు సాగారు. కార్మికుల‌కు-ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఉండే అసంతృప్తి పొర‌ను తొల‌గించే ప్ర‌య‌త్నం చేశారు. వారికి అత్యంత కీల‌క‌మైన ప‌థ‌కం చంద్ర‌న్న బీమాను క‌ల్పించారు. ప్ర‌తి ఒక్క‌రినీ పార్టీకి సేవ చేసేలా వ్య‌క్తిగ‌తంగా కూడా ప్రోత్స‌హించారు. ప‌రిశ్ర‌మ‌ల‌ను ర‌ప్పించేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల మేర‌కు అచ్చ‌న్న‌ను ర‌వాణా శాఖ‌కు మార్చారు. ఈ శాఖ‌లోనూ అచ్చ‌న్న మెరుపులు మెరిపించారు. త‌న‌దైన శైలిలో దూసుకుపోయారు. ముఖ్యంగా ఆర్టీసిని మ‌రింత చేరువ చేసేందుకు ఈ సంస్థ‌ను న‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డేసేందుకు త‌న‌దైన శైలిలో కార్య‌క్ర‌మాలు రూపొందించారు.

షార్ప్ షూట‌ర్‌గా..
మంత్రి అచ్చ‌న్నాయుడిలో ఉన్న మ‌రో ప్ర‌త్యేక ల‌క్ష‌ణం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డం. ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. ఆయ‌న వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి ప‌రిష్క‌రిస్తార‌నే పేరు తెచ్చుకున్నారు. ఇటు ప్ర‌భుత్వంతోను, అటు ప్ర‌జ‌ల‌తోను స‌మ‌న్వ యం చేసుకోవడంలో అచ్చ‌న్న త‌న‌దైన పాత్ర పోషిస్తూనే వ‌చ్చారు. 2016-17 మ‌ధ్య కాలంలో రాష్ట్రాన్ని కుదిపేసిన కాపు రిజ‌ర్వేష‌న్ విష‌యం, అనంత‌రం ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నిరాహార దీక్ష వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో సీఎం చంద్ర బాబు సూచ‌న‌ల మేర‌కు మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించిన మంత్రి అచ్చ‌న్న‌.. వివాదాన్ని తెగేదాకా లాగ‌కుండా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. వ్యూహం-నిర్మాణాత్మ‌క వ్య‌వ‌హార శైలి. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం వంటి విష‌యాల్లో అచ్చ‌న్న అంద‌రినీ మెప్పించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు.

విప‌క్షాల వెన్నులో వ‌ణుకే
మంత్రి అచ్చ‌న్నాయుడులో ఉన్న మ‌రో కీల‌క‌మైన ల‌క్ష‌ణం.. విప‌క్షాల‌కు అదిరిపోయేలా కౌంట‌ర్లు వేయ‌డం. ఏ విషయం చ‌ర్చ‌కు వ‌చ్చినా.. ఏ అంశంపై మాట్లాడాల్సి వ‌చ్చినా.. గంభీర గ‌ళంతో విప‌క్షాల‌పై విరుచుకుప‌డ‌డం అచ్చ‌న్నా యుడు ప్ర‌త్యేక‌త‌. ముఖ్యంగా అసెంబ్లీలో ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌, పార్టీ త‌ర‌ఫున మాట్లాడాల్సిన స‌మ‌యంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు న‌భూతో అన్న‌విధంగా సాగింది. త‌న అన్న ఎర్ర‌న్నాయుడి శైలిలో ఆయ‌న కూడా ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేయ‌డ‌మే కాకుండా గ‌ణాంక స‌హితంగా ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ప్ర‌భుత్వం చూపుతున్న చొర‌వ‌ను వివ‌రించే ప్ర‌య‌త్నం చేసి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను సైతం సొంతం చేసుకున్నారు అచ్చ‌న్నాయుడు.

పార్టీ అధినేత మాటే శిలా శాస‌నం
ఒక‌వైపు రెండు శాఖ‌ల‌ను నిర్వ‌హించిన మంత్రిగా, మ‌రోప‌క్క నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న‌ప్ప‌టికీ.. అచ్చ‌న్నాయు డికి మాత్రం పార్టీ అధినేత, సీఎం చంద్ర‌బాబు మాటే శిలా శాస‌నం. చంద్ర‌బాబు గీసిన గీతను దాట‌క‌పోగా.. ఆయ‌న ఏం చెప్పినా చేసేందుకు ఎప్పుడు రాముడికి ఆంజ‌నేయుడు ఎలా సేవ‌కుడిగా మారారో.. అదేవిధంగా చంద్ర‌బాబుకు అచ్చ న్న కూడా అలాగే వ్య‌వ‌హ‌రించారు. మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన‌ప్పుడు ఆనందంతో పొంగిపోలేదు. కొన్ని విష‌యాల్లో చోటు చేసుకున్న లోటు పాట్ల‌కు కుంగిపోలేదు. ఎప్పుడూసౌమ్యంగా , అభివృద్ధి విజ‌నే ల‌క్ష్యంగా అచ్చ‌న్న ప‌నిచేశారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోతూ.. ప్ర‌తి అడుగూ అభివృద్ధి దిశ‌గా ముందుకు న‌డిచారు. ఈ అడుగులే అచ్చ‌న్న‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేశాయి. రాబోయే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు అండ‌గా నిల‌వ‌నున్నాయి. విజ‌యాన్ని అందించ‌నున్నాయి.