రాహుల్ ఆరోపణపై అంబానీ స్పందన ఇదీ..!

రిలయన్స్ ఢిఫెన్స్ అధినేత అనిల్ అంబానీపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఆ కంపెనీ కొట్టిపారేసింది. కావాలని వాస్తవాలను ‘‘వక్రీకరించారనీ..’’, ‘‘యదార్థాలను’’ విస్మరించారని పేర్కొంది. రాఫెల్ ఒప్పందంపై సంతకాలు జరక్కముందే దీని గురించి అనిల్ అంబానీకి తెలిసిపోయిందనీ.. ఇది కచ్చితంగా అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని రాహుల్ ఇవాళ ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘‘కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఈమెయిల్‌కు, ఫ్రాన్స్‌తో భారత్ కుదుర్చుకున్న రాఫెల్ ఒప్పందానికి సంబంధం లేదు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సివిల్, ఢిఫెన్స్ హెలికాప్టర్‌ కోసం ఎయిర్‌బస్-రిలయన్స్ డిఫెన్స్ మధ్య జరిగిన సంభాషణ మాత్రమే…’’ అని రిలయన్స్ డిఫెన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

మిలటరీ హెలీకాప్టర్ ప్రోగ్రామ్ కోసం మహింద్రాతో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు అందరికీ తెలుసునని రిలయన్స్ డిఫెన్స్ పేర్కొంది. ఫ్రాన్స్ -భారత్ మధ్య రాఫెల్ ఒప్పందం జరిగింది మీడియాలో వస్తున్నట్టు 2015 ఏప్రిల్‌లో కాదనీ… 2016 జనవరి 25న ఎంవోయూ కుదిరిందని రిలయన్స్ డిఫెన్స్ వెల్లడించింది. రాహుల్ వాస్తవాలను వక్రీకరించారనేందుకు ఇదే నిదర్శనమని సదరు సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.