అమిత్‌ షాకి మళ్లీ షాక్ ఇచ్చిన మమత!

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ మరోసారి షాక్ ఇచ్చారు. ఆయన హెలికాప్టర్‌కు రెండోసారి అనుమతి నిరాకరించారు. ఇవాళ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతమైన జాగ్రాంలో అమిత్‌ షా ల్యాండ్ కావాల్సిఉంది. అయితే ఈ ప్రాంతంలో హెలికాప్టర్ దిగేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారు. కాగా నిన్న మాల్డా జిల్లాలో దిగేందుకు కూడా కమల దళపతికి మమత ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ వారంలో వీవీఐపీ హెలికాప్టర్లకు అనుమతి ఇవ్వడం కుదరదంటూ మాల్డా అధికారులు చెప్పారు.

కాగా తాజాగా మరోసారి అమిత్ షా హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించడంపై బీజేపీ శ్రేణులు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. గత రాత్రంతా కలెక్టర్‌ను ఒప్పించేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నాలు చేసినా ఆమె అందుబాటులోకి రాలేదు. దీంతో ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. జిల్లా కలెక్టర్ మహిళ కావడతో బీజేపీ మహిళా మోర్చా ఈ ఆందోళనకు నేతృత్వం వహించనున్నారు. గణతంత్ర బచావో యాత్ర పేరుతో బీజేపీ చీఫ్ అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లో నిన్న ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.