మరో గుడ్‌న్యూస్ చెప్పిన టీడీపీ ప్రభుత్వం

మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధులతో బాధపడే రోగులకు శుభవార్త. ఇకపై రోగులు ప్రైవేటు మందుల దుకాణాల్లో బీపీ, షుగర్‌ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఉచిత మందుల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.. ఈ పథకం కింద నెలకు సరిపడా మందులు ఒకేసారి పొందవచ్చు. రాష్ట్రంలో ఏ ప్రైవేటు రిటైల్‌ మెడికల్‌ షాపుల్లోనైనా రోగులు ఈ మందులు పొందే వెసులుబాటు కల్పించారు. బీపీ, షుగర్‌ రోగులపై ఆర్థిక భారం పడకుండా సంరక్షించేందుకు ప్రభుత్వం ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల ఐసీఎంఆర్‌, కలామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ టెక్నాలజీ సంయుక్తంగా ఏపీలో సర్వే నిర్వహించాయి. నెలకు రూ.వేలు వెచ్చించి బీపీ, షుగర్‌ మందులు కొనుగోలు చేసే రోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నట్లు గుర్తించారు. వారికి ఉచితంగా మందులు ఇవ్వడం ద్వారా ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రభుత్వానికి పంపగా, ఆమోదం లభించింది.

ఉచిత మందుల పథకంలో లబ్ధిదారులుగా చేరదలచిన రోగులు తొలుత తమకు ఉన్న బీపీ, షుగర్‌ వ్యాధులను సమీపంలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో నిర్ధారణ చేయించుకోవాలి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య బోధన ఆసుపత్రుల్లో డాక్టర్లు ఈ జబ్బులను నిర్ధారించాలి. ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు (ఈ-యూహెచ్‌సీలు), ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం నెట్‌వర్క్‌ ఆసుపత్రుల వైద్యులు కూడా ఈ వ్యాధులను నిర్ధారించవచ్చు. బీపీ పరీక్షలతో పాటు గ్లైకోజినేటెడ్‌ హీమోగ్లోబిన్‌ పరీక్షలు (షుగర్‌కు) చేయించుకోవాలి. షుగర్‌ రోగులు ఫాస్టింగ్‌, పోస్ట్‌ ప్రాండియల్‌ పరీక్షలతో వ్యాధిని నిర్ధారించాలి. అనంతరం డాక్టర్‌ రోగి పరీక్ష ఫలితాలను AP-eRX APP ద్వారా అప్‌లోడ్‌ చేస్తారు. వెంటనే రోగి సెల్‌ఫోన్‌ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌, కోడ్‌ వస్తుంది. అంతే రోగి లబ్ధిదారుడుగా ఎంపికైనట్లే. ఈ కోడ్‌ను చూపి రిటైల్‌ మెడికల్‌ షాపునకు వెళ్లి మందులు కొనుగోలు చేసుకోవచ్చు. ఒకసారి నెలకు సరిపడా మందులు ఇస్తారు. రోగులను ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చేందుకు వారి ఆధార్‌ నెంబర్‌, ప్రజాసాధికార సర్వే వివరాలను అనుసంధానం చేస్తారు. ప్రజా సాధికార సర్వేలో నమోదు కానివారు తమ సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రంలో సంప్రదించాలి.జిల్లాలో రిటైల్‌ మందుల దుకాణదారులు షుగర్‌, బీపీ మందులు విక్రయించేందుకు తొలుత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా గూగుల్‌ ప్లే స్టోర్‌ను ఓపెన్‌ చేయాలి. దానిలో AP-eRX for pharmacy అని టైప్‌ చేయాలి. వెంటనే ఇన్‌స్టాల్‌ బటన్‌ వస్తుంది. దానిని క్లిక్‌ చేస్తే ఇన్‌స్టాల్‌ అయ్యి నెంబర్‌, పాస్‌వర్డ్‌ అడుగుతుంది. నెంబర్‌, పాస్‌వర్డ్‌ ఇచ్చి రిజిస్టర్‌ అనే పదాన్ని క్లిక్‌ చేస్తే పూర్తి చేయాల్సిన దరఖాస్తు వస్తుంది. దరఖాస్తు పూర్తి చేయాలి. అనంతరం సబ్మిట్‌ బటన్‌ నొక్కితే ఒన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. ఈ నెంబర్‌ను ఎంటర్‌ చేసి సెండ్‌/ఓకే చేయాలి. వెంటనే రిటైల్‌ షాపు రిజిస్టర్‌ అవుతుంది.

మందుల దుకాణాలు తాము విక్రయించే మందులను బిల్లు, రోగి కోడ్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ప్రభుత్వం వారానికి ఒకసారి మందుల దుకాణాలకు ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (ఏపీ ఎంఎస్‌డీఈసీ) బిల్లులను పర్యవేక్షించి చెల్లింపులను పర్యవేక్షిస్తుంది.బీపీ, షుగర్‌ రోగులకు అందించే మందుల వివరాలను, ఆయా మందులకు ప్రైవేటు మెడికల్‌ దుకాణాలకు ప్రభుత్వం చెల్లించే ధరలను ప్రకటించారు. ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేసేందుకు ఏపీ ఎంఎస్‌ఐడీసీ సంస్థ చెల్లించే రేటును ఇందుకు ప్రామాణికంగా తీసుకున్నారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్‌ హెల్త్‌మిషన్‌ ప్రాజెక్ట్‌లో ఈ-ఔషధి పథకం కింద అందించే నిధులను ఈ పథకం కింద చెల్లింపులు జరుపుతామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.బీపీ, షుగర్‌ వ్యాధులతో బాధపడేవారికి ఉచితంగా ట్యాబ్లెట్లు ఇచ్చే పథకంపై మార్గదర్శకాలు అందాల్సివుంది. జిల్లాలో ఈ రెండు జబ్బులతో బాధపడేవారి వివరాలు, మెడికల్‌ షాపులతో పాటు ఏజెన్సీల వివరాలు సేకరించాల్సి ఉంది. ఇందుకోసం వైద్య ఆరోగ్యశాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాల్సివుంది. ఈ ప్రక్రియను మరో వారం రోజుల్లో ప్రారంభిస్తాం.