ఏపీ రైతులకు గుడ్ న్యూస్

ఏపీ రైతులకు తీపి కబురు. రైతుల అకౌంట్‌లోకి రూ. 3 వేలు సర్కార్ జమ చేసింది. రైతు సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు విడుదల అయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో నిధుల విడుదలపై సందేహాలు నెలకొన్నా.. చివరకు ఎన్నికల సంఘం అమోదంతో నిధులు విడుదల అయ్యాయి..

 

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రుపాయలను రైతుల ఖాతాల్లో వేసింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ వాటాగా రెండు వేల రుపాయలను కూడా రైతుల ఖాతాలకు జమ చేసింది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విధంగా రైతులకు రెండో విడతలో మూడు వేల రుపాయలు విడుదల చేసింది.

అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత పొందిన 50 లక్షల 19 వేల 352 కుటుంబాలకు మూడు వేల రుపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని విడుదల చేసింది ఏపీ సర్కార్‌. దాదాపు 1505.80 కోట్ల రుపాయలు ఈ పథకం కోసం ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇప్పటి వరకు 46.13 లక్షల రైతు కుటుంబాలకు 1384 కోట్ల రుపాయలను చెల్లించారు. మరో నాలుగు లక్షల 5 వేల 920మందికి చెల్లింపులు జరపాల్సి ఉంది.