ఏపీలో నేనే ముఖ్యమంత్రిని….

‘‘నేను సీఎం కాగానే చంద్రబాబును సలహాదారుడిగా పెట్టుకుంటాను. 2019లో నేను అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పటికే అనేక సర్వేలు ఈ విషయాన్ని నిర్ధారించాయి. దీనిని గుర్తించిన చంద్రబాబు నన్ను అడ్డుకోడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సీఎం కాలేడు’’ అని ప్రజాశాంతి వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. గుంటూరు, విజయవాడలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ చంద్రబాబు కలిసి నా సంస్థకు నిధులు రాకుండా నిలిపేశారు. వారిద్దరూ శాశ్వత మిత్రులు. వారితో జగన్‌ కూడా కలిశారు. వీళ్ళల్లో ఎవరికి ఓటు వేసినా మోదీకి ఓటు వేసినట్లే. నేనొక్కడినే మోదీకి ప్రత్యామ్నాయం. మోదీ రెండోసారి ప్రధాని కావడం అసంభవం. 18 పార్టీలతో కూడిన థర్డ్‌ ఫ్రంట్‌కు 300కు పైగా సీట్లు వస్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేస్తాను. ఎన్నికల్లో పవన్‌ ప్రభావం ఉండదు’’ అని పేర్కొన్నారు.