నిన్న‌టి ప్ర‌త్య‌ర్థులు.. నేటి మిత్రులు.. ఆత్మ‌కూరులో వైసీపీ చిత్తుచిత్తు..!

ఎన్నిక‌ల వేళ రాజ‌కీయం ఊపందుకుంది. ఒక‌ప‌క్క పార్టీలు ఎన్నిక‌ల వ్యూహంలో త‌మ‌కు ఏది అందివ‌స్తే.. దానిని స‌ద్విని యోగం చేసుకుంటున్నారు. ఎలా ముందుకు వెళ్లినా.. అంతిమ ల‌క్ష్యం మాత్రం.. పార్టీ గెలుపే. ఇక‌, ఈ క్ర‌మంలో ప్ర‌త్య‌ర్థు ల‌ను చిత్తు చేసేందుకు, ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఓడించేందుకు వేస్తున్న ఎత్తుగ‌డలు.. వ్యూహాతీతంగా ఉంటున్నాయి. అధికార టీడీపీలో ఇలాంటి వ్యూహాలు బాగానే క‌నిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా పాత కొత్త‌ల క‌ల‌యిక ఇప్పుడు టీడీపీలో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరులో టీడీపీ త‌ర‌పున బొల్లినేని కృష్ణ‌య్య పోటీ చేస్తున్నారు. ఇక‌, ఇక్క‌డ నుంచే వైసీపీ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యే మేక‌పాటి గౌతం రెడ్డి పోటీ చేస్తున్నారు.

గ‌డిచిన ఐదేళ్ల కాలంలో ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు అస్సలు అందుబాటులో లేకుండా పోయిన గౌతంను ఈ ద‌ఫా ఇంటికి పంపిం చాల‌ని నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు కూడా డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డ గౌతంకు తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది. అయితే, అదేస‌మ‌యంలో టీడీపీ కూడా వ్యూహ ప్ర‌తివ్యూహాలు సిద్ధం చేసుకుని అంద‌రినీ కూడ‌గ‌ట్టి మ‌రీ.. సీనియ‌ర్ల‌ను ఏక‌తాటిపై కి తెస్తున్నారు. మొత్తానికి ఈ వ్యూహం బాగా స‌క్సెస్ అవుతోంది. కొన్ని ద‌శాబ్దాలుగా శ‌త్రువులుగా ఉన్న సీనియ‌ర్లు కూడా నేడు ఒకే వేదిక పంచుకుంటున్నారు. ఒక‌రు ఒక‌సారి గెలిస్తే.. మ‌రొక‌రు మ‌రోసారి గెలిచిన నాయ‌కులు వీరంతా! ఈ నాయక త్ర‌యం గ‌తంలో ఆత్మ‌కూరు నుంచి విజ‌యం సాధించి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి కృషి చేశారు. నిజానికి వీరంతా ఒక‌రికొక‌రు ప్ర‌త్య‌ర్థులే. అయితే, ఇప్పుడు ఒకే వేదిక‌ను పంచుకున్నారు.

వివిధ పార్టీలో చ‌క్రం తిప్పిన వీరంతా ఇప్పుడు అధికార టీడీపీలోకి వ‌చ్చి ఐక్య‌తారాన్ని ఆల‌పిస్తున్నారు. వీరే బొమ్మిరెడ్డి సుంద‌ర‌రామిరెడ్డి, కొమ్మి ల‌క్ష్మ‌య్య నాయుడు, బొల్లినేని కృష్ణ‌య్య‌. ప్ర‌స్తుతం ఊపందుకున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో వీరంతా కూడా ఒకే వేదిక‌పై ద‌ర్శ‌న‌మిచ్చి.. ప్ర‌జ‌ల‌ను సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేస్తున్నారు. అవ‌గానికి పాత‌త‌రం నాయ‌కులే అయినా.. ఇక్క‌డ నేటి త‌రాన్ని సైతం ప్ర‌భావితం చేయ‌గ‌ల నేర్పు, ఓర్పు ఉన్న వ్యూహాత్మ‌క నేత‌లుగా వీరు పేరు తెచ్చుకున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ ఆచితూచి వేయ‌గ‌ల నేర్పు వీరి సొంతం. ఇక‌, ఇప్పుడు ఇక్క‌డ టీడీపీ జెండా ఎగ‌రేయాల‌నే ధ్యేయంతో వీరంతా ఉమ్మ‌డిగా చేస్తున్న ప్ర‌చారానికి ప్ర‌జ‌ల నుంచి కూడా భారీ ఎత్తున స్పంద‌న వ‌స్తుంద‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే.. వైసీపీ నేత‌లు ఇంటి బాట ప‌ట్టాల్సిందే..!