బొండా ఉమా గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేనా..!

బొండా ఉమా మ‌హేశ్వ‌రరావు. టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఈయ‌న ఈ విజయం కోసం దాదాపు ఐదారేళ్ల‌పాటు నిరీక్షించారు. చాలానే ఖ‌ర్చు చేశారు. అంద‌రినీ స‌మ‌న్వ‌యం చేసుకున్నారు. టీడీపీని ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లారు. భారీ ఎత్తున ఖ‌ర్చు కూడా చేశారు. ఇక‌, ఎమ్మెల్యేగా ఆయ‌న గెలిచిన త‌ర్వాత కూడా త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర‌ను వేసుకున్నారు. ఇటు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధిని కొత్త పుంత‌లు తొక్కించారు. పార్టీని ప్ర‌జ‌ల‌కు చేరువ చేశారు. ప్ర‌తి కార్పొరేట‌ర్‌కు ఓ కార్యాల‌యం ఏర్పాటు చేయించి అక్క‌డే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ఏర్పాటు చేశారు.

ఈ ప‌రిణామాల‌తో టీడీపీ ప్ర‌జ‌ల్లోకి త్వ‌ర‌గా వెళ్లింది. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత‌మైన అభివృద్ధి సాగింది. ప్ర‌తి ప్రాంతం లోనూ ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ఉండేలా క‌మ్యూనిటీ కేంద్రాన్ని నిర్మించారు. రైతు బ‌జార్ల‌ను విస్తృతంగా ఏర్పాటు చేశారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక‌టి అనే చంద్ర‌బాబు ఫార్ములాను ఇక్క‌డ కూడా అమ‌లు చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక రూపంలో సాయం అందించారు. మొత్తంగా ఈప‌రిణామం నియోజ‌క‌వ‌ర్గంలో బొండా ఉమా రేటింగ్‌ను అనూహ్యం గా పెంచేసింది. ఇక‌, వీటికి తోడు రాష్ట్ర రాజ‌కీయాల్లో కూడా బొండా ఉమా.. అనూహ్య‌మైన గుర్తింపు సాధించారు. విప‌క్షం వైసీపీని ఉతికి ఆరేయ‌డంలోబొండా ఉమా ప్ర‌త్యేక గుర్తింపు సాధించారు.

చంద్ర‌బాబుపైనా, పార్టీపైనా విప‌క్షం చేసే ఏ విమ‌ర్శ‌నైనా త‌న‌దైన శైలిలో తిప్పికొట్టిన ఘ‌న‌త బొండాకే సాధ్య‌మా? అనే రేంజ్‌లో ఆయ‌న విప‌క్షాల‌పై మాట‌ల యుద్ధం చేశారు. అసెంబ్లీలోనూ ఇటు బ‌య‌ట కూడా బొండా చూపిన దూకుడు ఆయ‌న‌కు పార్టీలోనే కాకుండా ప్ర‌జ‌ల్లోనూ విస్తృత‌మైన గుర్తింపు తెచ్చింది. ఫ‌లితంగా ఆయ‌న రాజ‌కీయంగా ఒక్క‌సారిగా విజృంభించారు. మంత్రి ప‌ద‌విని ఆశించినా ద‌క్క‌క‌పోయే స‌రికి ఒకింత అలిగినా.. బొండా ఉమా వంటి నాయ‌కుల అవ‌స‌రాన్ని గుర్తించిన చంద్ర‌బాబు ఆయ‌న‌కు టీటీడీ బోర్డు స‌భ్యునిగా అవ‌కాశం క‌ల్పించారు. మొత్తానికి సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో బొండాకు తిరుగులేద‌ని మ‌రోసారి రుజువు కానుంది. దీనికి వైసీపీలోని కొన్ని వ‌ర్గ విభేదాలు కూడా బొండాకు క‌లిసి రానున్నాయి. ఇదీ బొండా గెలుపుకు స‌హ‌క‌రించ‌నున్న పరిణామాలు.