సీబీఐ చీఫ్ అలోక్ వర్మ మరో సంచలన నిర్ణయం…

సీబీఐ డైరెక్టర్‌గా బుధవారం తిరిగి నియమితులైన అలోక్‌వర్మ ఇవాళ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జేడీ అజయ్ భట్నాగర్ సహా మొత్తం ఐదుగురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. తాజాగా బదిలీ అయిన వారిలో డీఐజీ ఎంకే సిన్హా, డీఐజీ తరుణ్ గౌబా, జేడీ మురుగేశన్, ఏడీ ఏకే శర్మ తదితరులు ఉన్నారు. పరిపాలనా విభాగం డిప్యూడీ డైరెక్టర్‌ అనీశ్ ప్రసాద్ యథావిధిగా తన స్థానంలోనే ఉండగా… నిఘా విభాగాన్ని పర్యవేక్షించే యూనిట్ 1 బాధ్యతలను కేఆర్ చౌరాసియాకి అప్పగించారు.

కాగా తాను సెలవులో ఉన్న సమయంలో తాత్కాలిక డైరెక్టర్‌ ఎం.నాగేశ్వర్‌రావు చేపట్టిన బదిలీలను వర్మ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలోక్‌ వర్మను విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్థానా పరస్పరం తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో… కేంద్ర ప్రభుత్వం ఇద్దరినీ విధుల్లోంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.