చంద్రబాబుకు దీక్షకు మద్దతు తెలిపిన బీజేపీ నేతలు

ఏపీపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు న్యూఢిల్లీలో తలపెట్టిన ‘ధర్మ పోరాటం’ దీక్షకు బీజేపీ అసమ్మతి నేతలు శత్రుఘన్ సిన్హా, యశ్వంత్ సిన్హా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శత్రుఘన్ సిన్హా మాట్లాడుతూ చంద్రబాబును కొనియాడారు. ‘ఆంధ్రా హీరో.. హీరో ఆఫ్ ది నేషన్’ అని చంద్రబాబును కీర్తించారు. తాము పార్టీకి హాని చేసే కార్యకలాపాలేవీ చేయడం లేదని, అన్యాయానికి వ్యతిరేకంగా తమ గొంతు వినిపిస్తామని శత్రుఘన్ సిన్హా అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘వ్యక్తి కంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే దేశం గొప్పది’ అని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన పార్టీని అవమానించినట్టు కాదని ఆయన అన్నారు. తాను పార్టీలోనే ఉన్నానని, ఇంకా పార్టీ ఎంపీనేనని సిన్హా అన్నారు. ప్రత్యేక హోదా అనేది ఏపీకి సంబంధించిన విషయం కాదని అది దేశానికి సంబంధించిన విషయమని సిన్హా ఉద్ఘాటించారు.