రాష్ట్రపతిని కలిసిన అనంతరం చంద్రబాబు మీడియాతో ఏమన్నారంటే…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కోరామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం చంద్రబాబు బృందం రాష్ట్రపతిని కలిసింది. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ విభజన హామీలు, ప్రత్యేక హోదాపై రాష్ట్రపతికి వినతిపత్రం అందజేశామన్నారు. విభజన హామీలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విభజన హామీలను కేంద్రం విస్మరించిందని ఆయన విమర్శించారు. ఏపీ ప్రజల న్యాయమైన డిమాండ్లు అమలుచేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీకి నిధులు విడుదల చేయకుండా కేంద్రం కాలక్షేపం చేసిందని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌ అభివృద్ధికి 60 ఏళ్ల పాటు కృషి చేశామని, హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దామని చంద్రబాబు చెప్పారు.

ప్రధాని మోదీలో నాయకత్వ లక్షణాలు లేవని చంద్రబాబు విమర్శించారు. దేశాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనా మోదీకి ఏ కోశానా లేదన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని చూసి ఎంతో మంది కలతచెందారని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఓ వికలాంగుడు అర్జున్‌రావు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని అన్నారు. తమ పోరాటానికి కాంగ్రెస్‌ పూర్తి మద్దతు తెలిపిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 11 జిల్లాల్లో ధర్మపోరాట దీక్షలు చేశామని, ఢిల్లీ దీక్షతో ఏపీ ప్రజల బాధను దేశం మొత్తం తెలియజేశామన్నారు. ఏపీకి విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో నిరంతరం పోరాటం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.