పులివెందుల పర్యటనపై చంద్రబాబు చెప్పిన కీలక విషయం

పులివెందులలో తమ పర్యటనకు అద్భుతమైన స్పందన వచ్చిందని సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు, చిత్తూరు, అన్నిచోట్లా టీడీపీపై సానుకూలత ఉందన్నారు. ప్రజల్లో కసిని, పౌరుషాన్ని టీడీపీకి ఓట్లుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీపై ఎక్కడ చూసినా తీవ్ర వ్యతిరేకత ఉందని టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలకు సూచించారు. ఏపీకి డబ్బులు ఇవ్వడానికి మోదీకి చేతులు రాలేదు కానీ..ఏపీని, టీడీపీని నిందించడానికి మాత్రం మోదీకి పెద్దనోరు ఉందని మండిపడ్డారు. మోదీ అహంభావానికి గుణపాఠం చెప్పాలన్నారు. కేసుల కోసం మోదీతో..ఆస్తుల కోసం కేసీఆర్‌తో జగన్ లాలూచీ పడుతున్నారని సీఎం ధ్వజమెత్తారు. ‘‘తెలంగాణకూ హోదా ఇవ్వాలన్న కేసీఆర్‌తో కలిసి రాష్ట్రానికి జగన్‌ హోదా తెస్తాడా?. పోలవరంపై పదేపదే కేసులేసే కేసీఆర్‌కు జగన్ మద్దతా..?. సాగర్, శ్రీశైలం మాకే ఇవ్వాలన్న కేసీఆర్‌కు జగన్ సపోర్టా..?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ఆపాలనే కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కయ్యారని అన్నారు. సీమను ఎడారిచేయాలనే కేసీఆర్‌కు జగన్ మద్దతా..? అని మండిపడ్డారు.