వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

వైసీపీపై సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో పడేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ నేతల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని, వైసీపీ పత్రికలో అసత్యాలు రాస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ అమరావతి వచ్చి మట్టి, నీళ్లు ఇచ్చి పారిపోయారని చంద్రబాబు ఎద్దేవాచేశారు.

‘‘వైసీపీ దొంగలు పనిచేయకుండా డబ్బులు తీసుకుంటున్నారు. వైసీపీ అవగాహనలేని రాజకీయాలు చేస్తోంది. అసెంబ్లీకి రాకుండా కుంటిసాకులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే ముందుకెళ్లా. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్‌ నన్ను విమర్శిస్తున్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మన కరెంట్‌ వాడుకున్నారు. తెలంగాణ మనకు రూ. 5 వేల కోట్లు ఇవ్వాలి. దేశంలోనే అద్భుతమైన రాష్ట్రాన్ని తయారుచేస్తా. 60 సంవత్సరాల కష్టాన్ని హైదరాబాద్‌లో వదిలివచ్చాం. 2022 మూడు అగ్రరాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంటాం. 2029 నాటికి దేశంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఏపీ ఉంటుంది. 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉంటాం’’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ బంగారు బాతు, ఆదాయం అంతా అక్కడే ఉందని, దేశంలో పేదలకు ఇళ్లు కట్టించిన రాష్ట్రం మనదేనని చంద్రబాబు చెప్పారు. తనకు 95 లక్షల మంది చెల్లెమ్మలు ఉన్నారని, ఓటు వేసేటప్పుడు మీకు చంద్రన్న కృషి గుర్తుకురావాలన్నారు. తిరుగులేని ఆర్థికశక్తిగా రాష్ట్రాన్ని తయారు చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.