చీరాల టీడీపీ టికెట్ క‌ర‌ణంకు ఇస్తే.. గెలుపు ఖాయం..!

అవును! ఎవ‌రిని ఎక్క‌డ ఎలా గురి చూసి కొడితే వ‌ర్క‌వుట్ అవుతుందో అలానే వ్య‌వ‌హ‌రించాలి. అక్క‌డే కొట్టాలి. పైపైన ఎన్నిదెబ్బ‌లు కొడితే మాత్రం ఏనుగు మాట వింటుందా? ప‌దునైన అంకుశంతో ఒక్క‌పోటు పొడిస్తే.. లైన్‌లోకి రాదూ!? ఇదే ఇప్పుడు చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కులు అంటున్న మాట‌. ఇక్క‌డ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ తో తాము విసుగెత్తిపోతున్నామ‌ని, ఆయ‌న పార్టీకి , నాయ‌కుల‌కు కూడా విలువ ఇవ్వ‌డం లేద‌ని, ఏ మాత్రం ప‌ట్టించుకో వ‌డం లేద‌ని, దౌర్జ‌న్యానికి, ద‌ర్పానికి కేరాఫ్‌గా మారాడ‌ని ఇక్క‌డి టీడీపీ నాయ‌కులు ఘొల్లుమంటున్నారు. జిల్లా పార్టీ నేత‌లంటే లెక్కలేకుండా త‌న‌కు తానే హీరోగా ఫీల‌వ్వ‌డం అత‌డి నైజం. పార్టీ అధిష్టానం అన్నా ఏమాత్రం గౌర‌వం లేద‌ని .. ఇలాంటి నాయ‌కుడికి టికెట్ ఇవ్వ‌డం వృధాయేన‌ని చెబుతున్నారు.

అయితే, ఇక్క‌డ ఆమంచిని ప‌క్క‌న పెడితే.. లేక ఆమంచి ఓడించే ధీరుడు ఎవరు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు సాధారణంగా ఇక్క‌డ ఒక‌టి రెండు పేర్లు వినిప‌స్తున్నా.. ఆమంచిని ధీటుగా ఎదుర్కొనే నాయ‌కుడు లేక‌పోవ‌డంతోనే ఇక్క‌డ ఆమంచి ఆట‌లు సాగుతున్నాయ‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. త‌న వ్య‌క్తిగ‌త స్వార్థ‌, రాజ‌కీయ ల‌బ్ధికోసం ఆమంచి పార్టీ పేరు చెప్పుకుని, ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాలు చెప్పుకుని తాను ఎదుగుతూ పార్టీని మాత్రం నిలువునా స‌ర్వ‌నాశ‌నం చేసేస్తున్నాడ‌న్న విమ‌ర్శ‌లు టీడీపీ వ‌ర్గాల్లోనే తీవ్రంగా ఉన్నాయి. ఈ రోజు అక్క‌డ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న సంక్షేమ ప‌థ‌కాలపై ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు ఫోటోలు లేకుండా కేవ‌లం త‌న ఫొటోనే వేసుకుంటున్నాడ‌న్న‌ది ఓపెన్ సీక్రెట్‌.

ఇక ఇటీవ‌ల ఎన్టీఆర్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మంలో ఆమంచి ఎదురుగానే ఆయ‌న అనుచ‌రులు త‌మ‌కు ఎన్టీఆర్ ఎవ‌రో తెలియ‌ద‌ని, ఇక్క‌డ అమ‌లు చేసే కార్య‌క్ర‌మాల‌న్నీ కేవ‌లం ఆమంచే చేస్తున్నాడ‌ని చెప్పినా దీనిని వేదిక మీద ఉన్న ఆమంచి ఏ మాత్రం ఖండించ‌లేదు. దీనిని బ‌ట్టి ఆమంచికి టీడీపీ అన్నా, ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు ఎన్టీఆర్ అన్నా ఎలాంటి విశ్వాసం ఉందో తెలుస్తోంది. రేపు చంద్ర‌బాబు ఇలాంటి వ్య‌క్తిని న‌మ్ముకుంటే చీరాల‌లో టీడీపీ ఎప్ప‌ట‌కీ బ‌లోపేతం కాద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యానికి తోడు ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కు కూడా టీడీపీలో ఉండ‌డ‌ని, వేరే పార్టీలలోకి వెళ్లిపోతాడ‌నే ప్ర‌చారం కూడా ఆమంచిపై ఎక్కువ‌గానే ఉంది. కేవ‌లం త‌న‌పై ఉన్న క్రిమినల్ కేసుల కార‌ణంగానే ఆయ‌న పార్టీలో కొన‌సాగుతున్నాడ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి నాయ‌కుడు పార్టీకి అవ‌స‌రం లేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇత‌ను ఏ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసినా.. లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా.. ఓడించే నాయ‌కుడు కావాల‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే ప్ర‌స్తుత ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి పేరు తెర‌మీదికి వ‌స్తోంది. ఆమంచి స‌రైన మొగుడు క‌ర‌ణ‌మేన‌ని అంటున్నారు త‌మ్ముళ్లు. ఈయ‌న క‌నుక చీరాల నుంచి రంగంలోకి దిగితే.. ఆమంచి తోక‌ముడ‌వ‌డం ఖాయ‌మ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌ధానంగా టీడీపీ కేడ‌ర్‌లో బ‌లం వ‌స్తుంద‌ని, ఆమంచిని ఎదిరించి నిలిచే శ‌క్తి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. పార్టీలో ఉండి. పార్టీ సొమ్ముతింటూ.. అధికారం వెల‌గ‌బెడుతూ.. కేసుల నుంచి త‌ప్పించుకుంటూ కూడా టీడీపీ ఓడిపోవాల‌ని కోరుకునే వ్య‌క్తి పార్టీకి అవ‌స‌రం లేద‌ని కూడా చీరాల టీడీపీ నేత‌లు చెపుతున్నారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియ‌ర్లు అంద‌రూ ఓడిపోవాల‌ని కోరుకునే ఆమంచి .. వాళ్ల‌పై నిత్యం వికృత వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌రిపాటిగా మారింద‌ని స్థానిక టీడీపీ నేత‌లే చెపుతారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి ఉన్న సీనియ‌ర్ల‌కు ఆమంచి ఏ మాత్రం గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి నాయకుడిని, విశ్వాస ఘాత‌కుడిని ఓడించేందుకు (అత‌డు ఎన్నిక‌ల వేళ అయినా పార్టీ మార‌డం ఖాయ‌మే) క‌ర‌ణాన్ని రంగంలోకి దింపితే.. తామే గెలిపించుకుంటామ‌ని అంటున్నారు. అప్పుడు అద్దంకి చిక్కుముడి కూడా విప్పిన‌ట్టే అవుతుంది. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.