సీఎం వరాల వెల్లువ

సంక్రాంతికి ముందే ‘సర్కారు సంబరాలు’ తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రజలకు వరాల మీద వరాలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ‘సంక్షేమ అస్త్రాలకు’ ఎన్నికల ముందు మరింత పదును పెడుతోంది. వృద్ధుల నుంచి దివ్యాంగుల వరకు… నేత నుంచి గీత దాకా… పాడిరైతు నుంచి ఆటో డ్రైవర్‌ వరకు అనేక వర్గాల వారికి లబ్ధి చేకూర్చేలా ‘సంక్షేమ సంక్రాంతి’ తెస్తోంది. ‘ఎన్టీఆర్‌ భరోసా’ కింద అందిస్తున్న అన్నిరకాల సామాజిక పింఛన్లను రెట్టింపు చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ‘జన్మభూమి’ సభలో అధికారికంగా ప్రకటించారు. అలాగే… అతి త్వరలో ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌ అందించాలని భావిస్తున్నారు. పాడికీ అండగా ఉండేలా పశువులకూ బీమా కల్పించాలని యోచిస్తున్నారు. రైతుకు అదనపు ఆదాయాన్ని ఇచ్చే పాడి పశువు చనిపోతే రూ.30 వేలు చెల్లిస్తారు. డ్వాక్రా మహిళలకు ‘పసుపు కుంకుమ’ కింద అదనంగా రూ.10వేలు చెల్లించాలని భావిస్తున్నారు. ఇక… వ్యవసాయంలో రైతులు విరివిగా ఉపయోగించే ట్రాక్టర్లు, బడుగులు ఉపాధి కోసం ఉపయోగించే ఆటోలపై అన్నిరకాల పన్నులను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు శుభవార్త. కొత్త సంవత్సరంలో వారికి సంతోషాన్ని కలిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుక ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి రూ.2వేల చొప్పున పెన్షన్‌ ఇవ్వనున్నట్లు ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. జనవరి నెలది కూడా కలిపి ఫిబ్రవరిలో ఒకేసారి రూ.3 వేలిస్తామని వెల్లడించారు. ఆర్థిక బలహీన వర్గాలకు పది శాతం రిజర్వేషన్‌ ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆంధ్రలోని కాపుల కోటా బిల్లును ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. వాల్మీకులు, మత్స్యకారులు, రజకులను వేరే వర్గాల్లోకి ఎందుకు చేర్చలేదని నిలదీశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలులో శుక్రవారం ఆరో విడత ‘జన్మభూమి-మా ఊరు’ ముగింపు సభలో చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘నిన్నా మొన్నా గ్రామసభలకు వెళ్లి చూశాను. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను చూస్తే బాధేసింది. మళ్లీ ఆలోచించాను. వారికి మరింత భరోసా ఇవ్వాలని సంకల్పించాను. ఇప్పుడిస్తున్న పింఛనును రూ.2 వేలు చేసి ఇస్తానని సభాముఖంగా మాటిస్తున్నా. ఇది మీ అందరికీ నూతన సంవత్సర కానుక.. సంక్రాంతి కానుక. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. నాకు కావలసింది పేదవాళ్లే. జనవరి నెల రూ.1,000 కూడా కలిపి ఫిబ్రవరిలో మూడు వేలిస్తా. తర్వాతి నుంచి రూ.2 వేల చొప్పున ఇస్తా. సంతోషమా..? నేను కష్టపడేదే మీ కోసం. ఇంకా కష్టపడతా. సంపద సృష్టిస్తా.. సంపాదించింది తిరిగి మీకే ఇస్తా. నాకూ ఇబ్బందులున్నాయి. డబ్బులు లేవు. అయినా మీ కష్టాలు తీర్చే బాధ్యత, మీ కంట నీరు తుడిచే బాధ్యత నాది. తెలుగుదేశం ప్రభుత్వం అంటే నమ్మకం. జగన్‌ అంటే భయం. రాష్ట్రంపై ముగ్గురు మోదీలు కన్నేశారు. ఒక మోదీనే భరించలేకపోతున్నాం. ఇక ఆ ముగ్గురు కలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. సంక్షోభ పరిస్థితుల్లో సుస్థిర ప్రభుత్వం అవసరం. ప్రపంచదేశాల ప్రజలు ఇలాంటి తీర్పు ఇవ్వడం వల్లే అమెరికా, జర్మనీ సహా పలు దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి.’

మీ నమ్మకాన్ని వమ్ముచేయలేదు..
‘నేనైతేనే రాష్ట్రాన్ని కాపాడుతానని నమ్మి 2014లో నాకు ఓట్లు వేసి అధికారంలో కూర్చోబెట్టారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. రేయింబవళ్లు కష్టపడుతున్నా. రాజధాని రాష్ట్ర ప్రజల కల. దానికి సహకరిస్తామని చెబితే ఎన్డీఏతో జత కట్టాను. ఏదైనా ఇస్తాడని ప్రధాని మోదీని రాజధాని శంకుస్థాపనకు పిలిచాను. ఆయన మట్టి..నీళ్లు తెచ్చి మన ముఖాన కొట్టేసిపోయారు. అయినా నేను వెనక్కి తగ్గలేదు. రాజధాని ప్రాంత రైతులకు పిలుపిచ్చా. నన్ను నమ్మి 34 వేల ఎకరాల భూమి ఇచ్చారంటే అదీ నా ప్రభుత్వంపై ఉన్న నమ్మకం. సింగపూర్‌కు వెళ్లాను. రాజధాని నిర్మాణానికి సహకరించమని అడిగాను. వాళ్లు పైసా కూడా తీసుకోకుండా కేబినెట్‌లో పెట్టి మనకు మాస్టర్‌ ప్లాన్‌ ఇచ్చారు. ఇదీ నాపై ఉన్న నమ్మకం. రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తే అక్కడ భారీ పరిశ్రమలు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. ఒకే రోజు లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది నమ్మకం వల్ల జరిగింది కాదా? నమ్మకం లేకపోతే జరిగేవేనా..? వైసీపీ అధినేత జగన్‌ అంటే అందరికీ భయం. ఆయనతో జైలుకు తీసుకుపోతాడనే భయంతో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు. పారిశ్రామికవేత్తలు వాళ్ల జీవితాలనే నాశనం చేసుకున్నారు. కొంతమంది అధికారులు ఈయన మాటలు విని జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. మనం ఏ పనిచేసినా నీతిగా చేస్తాం. అదీ వాళ్లకు, మనకు ఉన్న తేడా.’

కుక్కలు చింపిన విస్తరి కాకుండా..
‘ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సోషల్‌ మీడియాలో చాలామంది మెసేజ్‌లు చేస్తున్నారు. ఒకతను రాశాడు. ‘మీకేం సార్‌. మీరు బాగానే ఉంటారు. మేం నాశనమైపోతాం. అందుకే మళ్లీ మీరే (చంద్రబాబు) రావాలి. 135 కోట్ల మంది ప్రతినిధిగా ఉన్న ప్రధాని కూడా స్థాయి మరచి మీపై కత్తి కట్టారు.. రాష్ట్రం మీద కత్తి కట్టారు. మీరింకే పదవీ కోరుకోరు.. కానీ మా పిల్లల భవిష్యత్‌ కోసం మీరే రావాలి సార్‌.. దేశంలో నాశనం అవుతున్న వ్యవస్థలను తిరిగి గాడిలోపెట్టాలంటే మీరు రావాలి. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న రాష్ట్రాన్ని అవినీతి, అరాచక, అటవిక పాలనవైపు వెళ్లకుండా ఉండాలంటే మీరే రావాలి సార్‌.. అని ఇలా చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. నేను నాలుగున్నరేళ్లు రాత్రింబవళ్లూ మీ కోసం కష్టపడ్డాను. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి కాకూడదంటే మళ్లీ టీడీపీయే రావాలి. ఈ ప్రభుత్వానికి అండగా ఉండే బాధ్యత మీది. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత, కష్టాలు లేకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అండగా నిలవండి. ఆశీర్వదించండి. విభజన హామీలను నెరవేర్చండని మోదీని అడిగాం. ప్రత్యేక హోదా కోరాం.. అడుక్కున్నాం.. గట్టిగా అడిగాం.. ఏమీ చేయకుంటే విధిలేక విడిపోయాం. దీనికి మోదీ కక్ష కట్టారు. నియంతలా వ్యవహరిస్తున్నారు. మనవాళ్లపై సీబీఐ దాడులు చేయించారు. మరోఅడుగు ముందుకేసి మన టెలిఫోన్లన్నీ ట్యాప్‌ చేస్తున్నారు. మన కంప్యూటర్లలోకి ప్రవేశించి సమాచారం దొంగిలించబోతున్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు.’

మీ ఆరోగ్యమే మా భాగ్యం
‘పేదలపై వైద్యం ఖర్చులు భారాన్ని తగ్గించేందుకు ఏప్రిల్‌ నుంచి ఎన్టీఆర్‌ వైద్య సేవల పరిమితిని రూ.5లక్షలకు పెంచుతున్నాం. వైద్య ఖర్చులు తగ్గించడం కోసం ఇప్పటికే చాలా చర్యలు తీసుకున్నాం. ఆస్పత్రుల్లో వైద్య పరీక్షల ఖర్చులు, మందుల ఖర్చులు తగ్గించాం. ప్రజలు ఒక విషయం ఆలోచించాలి. ప్రజల కష్టాలు గమనించి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏ ఒక్క కార్యక్రమాన్నీ నిలిపివేయలేదు. కిలో రూపాయికే బియ్యం ఇస్తున్నాం. సంక్రాతి కానుక, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక ఇస్తున్నాం. మన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నాయకులు అభివృద్ధి, సంక్షేమాల్లో మన దరిదాపుల్లో అయినా ఉన్నారా..?’

60,590 మంది రైతులకు పట్టాల పంపిణీ..
జన్మభూమి ముగింపు సభ పేదలు, వృద్ధుల్లో మరపురాని మధురానుభూతి కలిగించింది. పింఛన్ల పెంపు ప్రకటనతో వారి ఆనందానికి అవధుల్లేవు. వేదికపైన ఉన్న నాయకులు, సభాప్రాంగణంలోని ప్రజలందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలోని 66,276 ఎకరాల సీజేఎ్‌ఫఎస్‌ భూమిని 60,590 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు సీఎం పట్టాలుగా పంపిణీ చేశారు. పట్టాలన్నీ మహిళల పేర్లపై ఇవ్వడం గమనార్హం. పసుపు-కుంకుమ కింద ఈ పట్టాలు ఇస్తున్నానని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం అన్నారు. రూ.8వేల కోట్ల విలువైన భూములు తమ పేర్ల మీద పట్టాలు చేతికి అందడంతో ఎస్సీ, ఎస్టీ మహిళలు ఆనందపడ్డారు. పదే పదే పట్టా కాగితాలను చూసుకుంటూ మురిసిపోయారు.