కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న కీలకనేత?

కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) అధికార ప్రతినిధి పిన్నమనేని సతీశ్‌వర్మ కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నట్టు ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ఏ పార్టీలో చేరేది ఇంకా కచ్చితంగా నిర్ణయించుకోనప్పటికీ వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. మండలంలోని జేబీపురం పంచాయతీ వరహాపురం గ్రామానికి చెందిన సతీశ్‌వర్మ సుమారు రెండు దశాబ్దాల నుంచి కాంగ్రెస్‌ పార్టీలో వివిధ పదవులు నిర్వహించారు. కొద్దికాలం డీసీసీ అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. పసుపులేటి బాలరాజు మంత్రిగా వున్నప్పుడు ఆయన సహకారంతో చీడికాడ మండలం మంచాలలో మోడల్‌ స్కూల్‌ ఏర్పాటుకు కృషి చేశారు. కాగా బాలరాజు కాంగ్రెస్‌ను వీడి జనసేన పార్టీలో చేరగా, కాంగ్రెస్‌ పార్టీలో వుంటే రాజకీయంగా మనుగడ వుండదన్న ఉద్దేశంతో ఏ పార్టీలో చేరాలన్నదానిపై తన అనుచరుల సంప్రదింపులు జరపగా, ఎక్కువ మంది వైసీపీలో చేరాలని సూచించినట్టు తెలిసింది. అనంతరం ఆయన వైసీపీకి చెందిన మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడును కలిసినట్టు సమాచారం. సతీశ్‌వర్మ కొద్ది రోజుల్లోనే వైసీపీ కండువా కప్పుకుంటారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.