కాంగ్రెస్‌లో హై టెన్షన్

గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసింది. పార్లమెంటు ఎన్నికల ముందు హస్తం పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ గూటికి చేరువయ్యారు. త్వరలోనే గులాబీ తీర్ధం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి గులాబి పార్టీలో చేరతామని ప్రకటించగా తాజాగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. అనంత‌రం టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌లో అమోమయం నెలకొంది. వరుసగా ఎమ్మెల్యేలు చేజారుతుండటంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధుల ప్రకటన‌కు ముందు నుంచే టీఆర్ఎస్ ఓ ప్రణాళికతో ముందుకెళ్లింది. ఎమ్మెల్యే కోటాలో నలుగురు ఎమ్మెల్సీలను మాత్రమే గెలిపించుకునే బలం ఉన్నా టీఆర్ఎస్ ఐదో అభ్యర్ధిగా మిత్రపక్షం ఎంఐఎంకు మద్దతివ్వడం గులాబీ పార్టీ ముందస్తు వ్యూహంతోనే ముందుకెళ్లింది. ఈ వ్యూహంతోనే హస్తం పార్టీని దెబ్బకొట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోనికి చేరుతామని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారు.

గతంలో టీఆర్ఎస్ పార్టీలో టీటీడీపీని వీలినం చేసుకున్న స్ట్రాటజీనే ఇప్పుడు కాంగ్రెస్ విషయంలోను వర్కౌట్ చేయాలని చూస్తోంది. అంతేకాదు పార్లమెంటు ఎన్నికల ముందు నైతికంగా కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని టీఆర్ఎస్ కొనసాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న గులాబీ పార్టీ ఖమ్మం జిల్లాలో మాత్రం డీలా పడింది. దీంతో ఖమ్మం పార్లమెంటు కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ టీడీపీ ఎమ్మెల్యేలపై ఆకర్ష్ అస్త్రం ప్రయోగించింది. అందులో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గులాబీ పార్టీలో చేరుతానని ప్రకటించారు. ఇక వైరా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన ఎమ్మెల్యే రాములు నాయక్ ఇప్పటికే టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తాజాగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించడంతో ఖమ్మం ఎంపీ స్థానం ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో టీఆర్ఎస్ ఉంది.

రంగారెడ్డిలో కీలక నేత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరడం ఖాయమైంది. త్వరలోనే ఆమె కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మరికొంత మంది ఎమ్మెల్యేలు కారెక్కెందుకు రెడీగా ఉన్నారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జాజుల సురేందర్ ఈ నెల 19న నిజామాబాద్‌లో జరిగే బహిరంగ సభలో టీఆర్ఎస్‌లో చేరుతారనే వాదన బలంగా వినిపోస్తోంది.

మొత్తానికి గత కొన్నాల్లుగా కాంగ్రెస్ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతారనే చర్చకు తాజాగా జరుగుతున్న పరిణామాలు నిదర్శమనే వాదనకు బలం చేకూరుతోంది