దేవాన్ష్ వెండితెర ఆరంగేట్రం..! ఎన్టీఆర్ రోల్‌లో ముని మనవడు..!!

యుగపురుషుడు మునిమనవడు, చంద్రబాబు, భువనేశ్వరిల మనవడు, లోకేష్- బ్రహ్మణిల కుమారుడు.. నారా దేవాన్ష్.. తెరంగేట్రం చేయబోతున్నారు. అదీ కూడా నందమూరి తారక రామారావు పాత్రలో. బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో ఇప్పటికే స్టార్ కాస్టింగ్ అద్దిరిపోయే రేంజ్ లో ఉంది. వారి జాబితాలో నారా దేవాన్ష్ కూడా చేరినట్లు ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఫోటోషూట్ కూడా నిర్వహించారని.. ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో బాలయ్య టైటిల్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఇతర పాత్రలకు కూడా నందమూరి హీరోలనే ఖరారు చేస్తున్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్ బాల్యానికి సంబంధించిన సన్నివేశాల్లో ఎన్టీఆర్ పాత్రలో నారా దేవాన్ష్ ను నటింపచేయాలని బాలకృష్ణ నిర్ణయించారు. ఎన్టీఆర్ కు నాలుగైళ్ల వయసున్నప్పుడు సన్నివేశాల్లో నారా దేవాన్ష్ కనిపిస్తారు. ఆ తర్వాత కొంచెం పెద్దయి.. టీనేజ్ వయసులో ఉన్న ఎన్టీఆర్ పాత్రలో కళ్యాణ్ రామ్‌ తనయుడు శౌర్యారామ్‌ కనిపిస్తారు. ఇక నందమూరి హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్‌ నటించనున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ నందమూరి కుటుంబ అభిమానులకు పండుగ కానుంది. అన్ని తరాల వాళ్లు తెరపై కనిపించి కన్నుల పండువ చేయనున్నారు.

తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ … కొద్దిరోజుల క్రితం రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభమయింది. బాలకృష్ణ తొలి గెటప్ లో అచ్చంగా ఎన్టీఆర్ ను దింపేయడంతో.. అభిమానులు ఖుషీగా ఉన్నారు. ఈ సినిమాలో బాలయ్య మొత్తం 63 పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాను వారాహి చలనచిత్ర, విబ్రి మీడియా సమర్పణలో సాయి కొర్రపాటి, విష్ణు వర్థన్ ఇందూరి, నందమూరి బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను బాల్యంలో మట్టిలో ఆడుకున్న మధురక్షణాల దగ్గర్నుంచి.. చూపించాలని డిసైడవడం.. ఆయా వయసు పాత్రల్లో ఎన్టీఆర్ మనవళ్లను… చూపిస్తూండటంతో.. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూపెరిగిపోతున్నాయి.