గుడివాడలో టీడీపీ దూకుడు… చంద్రబాబు ప్రచారం తర్వాత తారుమారైన అంచనాలు..

గుడివాడలోని టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. సీఎం చంద్రబాబు పర్యటనతో నేతలు, కార్యకర్తల్లో ధీమాను పెంచింది. గుడివాడలో శుక్రవారం జరిగిన సీఎం పర్యటనకు జనం భారీగా తరలిరావడం.. ఎండలో సైతం కదలకుండా కూర్చోవడం పార్టీ విజయానికి సంకేతమని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. సీఎం పర్యటనతో శ్రేణులు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. గుడివాడలో అవినాష్‌ విస్తృత ప్రచారం చేస్తున్నారు. నేతలందరూ కలసికట్టుగా ఆయన విజయానికి కృషి చేస్తున్నారు.

గుడివాడలో వైసీపీకి ఎదురేలేదని ఆ పార్టీ నేతలు ఇప్పటివరకు ప్రగల్బాలు పలుకుతూ వచ్చారు. దేవినేని అవినాష్‌ను అభ్యర్థిగా ప్రకటించగానే కొడాలి నాని మెజార్టీ ఈసారి 20 వేలకు పెరుగుతుందని, ఉఫ్‌ అని ఊదేస్తామని బీరాలు పోయారు. కానీ అవినాష్‌ వచ్చిన దగ్గర్నుంచి గుడివాడ టీడీపీలో పరిణామాలు చకచకా మారిపోయాయి. అందరి అంచనాలు తారుమారయ్యాయి. వచ్చిన పదిరోజుల్లోనే అవినాష్‌ దూసుకుపోతున్నారు. చంద్రబాబు వార్నింగ్‌, సూచనలతో టీడీపీ యంత్రాంగం మొత్తం దాదాపుగా ఏకతాటిపైకి వచ్చింది. నానికి వ్యూహాల్లో గానీ, ఎత్తుగడల్లో కానీ ఎందులోనూ వీసమంత కూడా తగ్గేది లేదన్న అభిప్రాయాన్ని అవినాష్‌ అండ్‌కో పార్టీ కేడర్‌లో కలిగించింది.

ఆత్మరక్షణలో వైసీపీ
రోజురోజుకు అవినాష్‌కు పెరుగుతున్న ఆదరణ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. టీడీపీ స్పీడ్‌ వైసీపీని ఆత్మరక్షణలో పడేసింది. ఆ పార్టీ చేస్తున్న ప్రచారానికి కనీస స్పందన కూడా కనిపించడం లేదు. వైసీపీ ముఖ్య నేత వెంట తిరిగే నాయకులే ఈ ఎన్నికల్లో తమ పని ఖాళీ అనే అభిప్రాయానికి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు పది రోజుల ముందే నాని వర్గం డీలా పడటం చూసి పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. కొడాలి నాని శిబిరంలో ఇలాంటి వాతావరణం నెలకొనడం ఇదే ప్రఽథమమంటూ వ్యాఖ్యలు వినవస్తున్నాయి.

చేరికల పేరిట వైసీపీ హైడ్రామాలు
చేరికల పేరిట హడావుడి చేస్తూ కొడాలి నాని తన కేడర్‌లో ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినవస్తు న్నాయి. తమ నుంచి ఒక్కరూ వైసీపీలోకి వెళ్లలేదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎన్నాళ్లీ సాకులు
పదిహేనేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కొడాలి నాని అధికార పక్షంలో ఎవరు ఉన్నా తగాదాలు పెట్టుకుని గుడివాడ అభివృద్ధిని తాకట్టు పెట్టారనే విమర్శలు మూటగట్టుకున్నారు. ఏనాడూ శాసనసభలో గుడివాడ సమస్యలు ప్రస్తావించకపోవడం, ప్రభుత్వ శాఖలకు లేఖలు రాయకపోవడం వంటివి ఆయన వైఫల్యాలకు తార్కాణంగా నిలుస్తున్నాయనే వాదన ప్రజల్లో బలంగా ఉంది. ప్రతి ఎన్నికల్లో తాను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉండటంతో అభివృద్ధి చేయలేకపోతున్నానని చెప్పడం కొడాలి నానికి పరిపాటిగా మారిందనే విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి.

అవినాష్‌ రాకతో టీడీపీలో స్ఫూర్తి
చంద్రబాబు తన ప్రసంగంలో నాని పేరు ఎత్తకుండానే ఆయనపై ఘాటైన విమర్శలు చేశారు. 2004లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒత్తిడితో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సీటును త్యాగం చేయించి చంద్రబాబు గుడివాడ స్థానాన్ని ఎమ్మెల్యే నానికి ఇచ్చారు. 2004, 2009లో టీడీపీ టికెట్‌పై గెలిచిన కొడాలి నాని 2013లో పార్టీ ఫిరాయించి వైసీపీలోకి వెళ్లారు. 2014లో జగన్‌ అధికారంలోకి వస్తాడని, తాను హోంమంత్రినవుతానని ప్రచారం చేసుకుని టీడీపీ నాయకులను తప్పుదారి పట్టించి నాని గెలిచారని ఆరోపణలు ఉన్నాయి. కొడాలి నాని టీడీపీలో గ్రూపులు పెంచి పార్టీని బలహీన పరిచే వ్యూహాలు అమలు చేశారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. అవినాష్‌ను గుడివాడ పంపాలని నిర్ణయించారు. నాని రాజకీయ అనుభవం, ఎత్తుగడలు, రాజకీయ వ్యూహాల ముందు అవినాష్‌ తేలిపోతాడని, పోటీ ఏకపక్షమే అవుతుందని వైసీపీతో పాటు టీడీపీలోని కొందరు నాయకులు ప్రచారం చేశారు. వీటన్నిటికీ అవినాష్‌ గుడివాడ వచ్చిన కొద్దిరోజులకే ఫుల్‌స్టాప్‌ పెట్టారు. తన మాటతీరు, నడవడిక, ప్రసంగాలతో అందర్నీ ఆకట్టుకున్నారు. టీడీపీ వర్గాలు సైతం నానికి ధీటైన అభ్యర్థిని దింపారనే అభిప్రాయానికి వచ్చేశారు. రావి వెంకటేశ్వరరావు సైతం అవినాషే ధీటైన అభ్యర్థని వెల్లడిస్తూ కేడర్‌లో స్ఫూర్తి కలిగిస్తున్నారు.

గుడివాడ అభివృద్ధికి భరోసా
సీఎం చంద్రబాబు శుక్రవారం గుడివాడ అభివృద్ధికి ఇచ్చిన హామీలు ప్రజల్లో ఉత్సాహం నింపాయి. కీలకమైన ఔటర్‌రింగ్‌ రోడ్‌ ఏర్పాటుతో నలుదిశలా అడ్డంకులతో కుచించుకుపోయిన గుడివాడ పట్టణ పరిధి పెరిగే అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. విజయవాడ- గుడివాడ రోడ్డును నాలుగు వరసలుగా మారుస్తామని హామీ ఇవ్వడాన్ని ముఖ్య పరిణామంగా భావిస్తున్నారు. చేపలు, రొయ్యల చెరువులు అధికంగా ఉండే నందివాడ మండలంలో ఆక్వా హబ్‌ ఏర్పాటు, రవాణ రంగానికి ఊతమిచ్చేలా లాజిస్టిక్స్‌ హబ్‌ ఏర్పాటుకు నిర్ణయాలు వెల్లడించడం వంటివి అభివృద్ధికి కీలక ముందడుగుగా పరిశీలకులు భావిస్తున్నారు. గుడివాడ అభివృద్ధికి తాను స్పష్టమైన రూట్‌మ్యాప్‌తో వచ్చానని చెప్పిన దేవినేని అవినాష్‌ తొలి సభలోనే ముఖ్యమంత్రి వద్ద వాటిని ప్రస్తావించి ఆమోదముద్ర పొందడం విజయానికి సంకేతంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.