హాట్ టాపిక్ గా ఆ నియోజకవర్గం.. అక్కడ ఏ పార్టీ గెలిస్తే అదే అదికారంలోకి

ఏలూరులో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఇక్కడి గెలుపోటములపై ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే అదే అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్ ఉంది. దీంతో ఇక్కడ రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. గత కొంతకాలంగా బుజ్జి వర్సెస్ నాని కూడా పోటీ జరుగుతోంది. మరి ఈసారి బుజ్జి గెలుస్తారా? నానికే జనం పట్టం కడతారా?

రాజకీయ కుటుంబ నేపథ్యమున్న బడేటి బుజ్జి మరోసారి టీడీపీ అభ్యర్ధిగా రంగంలో దిగారు. మున్సిపల్ వార్డ్ మెంబర్, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గా అనుభవం ఉన్న బుజ్జికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీలో ఉన్న బుజ్జి.. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలో చేరారు. అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2014 తిరిగి సొంతగూటికి చేరి వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసిన ఆళ్లనానిపై 24వేల 603 ఓట్ల మెజార్టీతో విజయబావుటా ఎగురవేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోసారి రానున్న ఎన్నికలకు కూడా టీడీపీ అధిష్టానం బడేటి బుజ్జికే అభ్యర్ధిత్వం ఖరారు చేయడంతో ప్రచారంతో జోరు పెంచారు. అటు ఆళ్ల నాని కూడా వైసీపీ నుంచి బరిలో దిగడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. గతంలో టీడీపీ లో ఉన్న రెడ్డి అప్పలనాయుడు తర్వాత వైసీపీ లో చేరి ప్రస్తుతం జనసేన అభ్యర్థిగా ఏలూరు నుండి బరిలోకి దిగుతున్నారు. ముగ్గురి మధ్య మరోసారి రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది. తెలుగుదేశం సంక్షేమ పథకాలు, తాను చేసిన అభివృద్ధి మళ్లీ గెలిపిస్తాయని బడెటి నమ్ముతున్నారు. అయితే ఆశించిన మేర అభివృద్ధి చేయలేదని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తమ్మిలేరు ఏటిగట్టు, పక్కా ఇళ్ల నిర్మాణం వంటి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడలానే మిగిలిపోయాయంటున్నారు.

అటు రాజకీయంగా వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులతో జోరు పెంచారు. వలస రాజకీయాలు ఉపందుకున్నాయి. ఇప్పటికే మేయర్ మేయర్ నూర్జహాన్ దంపతులు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. దీంతో తమకు లాభిస్తుందని వైసీపీ నమ్ముతోంది. అయితే వైసీపీ లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ బలరాం కుటుంబం టీడీపీలో చేరేందుకు సిద్దమైంది. టీడీపీలో చేరితే తమదే విజయం అని టీడీపీ అంటోంది. మొత్తానికి ప్రచారజోరు.. వలసల జోరుతో ఏలూరు రాజకీయం ఆసక్తిగా మారింది.