వంగవీటి రాధా విష‌యంలో.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం…!

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చివరి అంకానికి చేరుకుంది. రేపటితో(జనవరి 09) ప్రజా సంకల్ప యాత్ర ముగియనుంది. ముగింపును గ్రాండ్‌గా నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగియనుంది. దాదాపు సంవత్సరం నుంచి జగన్ కాలినడకన రాష్ట్రాన్ని చుట్టేశారు. పాదయాత్ర పార్టీకి మైలేజ్ తీసుకొస్తుందని వైసీపీ భావిస్తోంది. మరోవైపు ఈ ఏడాదే ఎన్నికల సమరం. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీడీపీ-వైసీపీ ఢీ అంటే ఢీ అన్నట్టుగా రెడీ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో వైసీపీలో నెలకొన్న అంతర్గత కుమ్మలాటలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.

విజయవాడలో వైసీపీకి బలమైన నేతగా ఉన్న వంగవీటి రాధా అలకపాన్పు ఎక్కారు. ఓ వైపు వైసీపీ కేడర్ అంతా ఇచ్ఛాపురంలో జరిగే బహిరంగ సభకు సిద్ధపడుతుండగా వంగవీటి రాధా నుంచి మాత్రం ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఆయన ఇచ్ఛాపురం వెళ్లడం లేదని తెలుస్తోంది. ఆయన గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో నెలకొన్న విభేదాలే కారణమని ఆయన సన్నిహితులంటున్నారు.

మరోవైపు పాదయాత్ర ముగింపు సభకు కేవలం సమన్వయకర్తలను మాత్రమే ఆహ్వానించారని తనను ఆహ్వానించలేదని అందుకే దూరంగా ఉంటున్నట్లు రాధా చెబుతున్నారు..! సీటు విషయంలో సందిగ్ధం ఏర్పడిన నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈయన అలకపై వైసీపీ అధినేత జగన్ ఇంత వరకూ స్పందించిన దాఖలాల్లేవ్. ఇవన్నీ అటుంచితే త్వరలోనే వైసీపీ తొలి జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో అసలు వంగవీటి రాధా పేరుంటుందా..? ఉండదా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.