కొండ‌పి విన్న‌ర్ ఎవ‌రు… గెలుపు కాదు… మెజార్టీ మీదే లెక్క‌

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌కాశం జిల్లా కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం వేడెక్కింది. ఇక్కడ ప్ర‌స్తుతం టీడీపీ నాయ‌కుడు డోలా బాల వీరాంజ‌నేయ స్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ పాగా వేయాల‌ని నిర్ణ‌యించుకుంది. అదే స‌మ‌యంలో టీడీపీ కూడా త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోం ది. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఇరు పార్టీలు జోరుగా ప్ర‌చారం ప్రారంభించేశాయి. కొండ‌పి నియోజకవర్గంలో.. కొండ‌పి, టంగుటూరు, జరగుమల్లి, సింగరాయకొండ, పొన్నలూరు, మర్రిపూడి మండలాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2లక్షల 14వేలు. పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన ఈ నియోజకవర్గంలో.. కమ్మ సామాజికవర్గ ఓట్లే అధికం.

రాజకీయపరంగా చూసుకుంటే ఇది ఎస్సీ నియోజకవర్గం. 2009లో కొండ‌పి ఎస్సీ నియోజకవర్గంగా మారిన తరువాత కాంగ్రెస్ అభ్యర్ధి జీవీ.శేషు తన సమీప టీడీపీ అభ్యర్ధి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామిపై 5వేల ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి బాలా వీరాంజనేయ స్వామి వైసీపీ అభ్యర్ధి జూపూడి ప్రభాకర్‌పై 5వేల మెజార్టీతో గెలుపొందారు. అయితే రాజకీయ సమీకరణామాలు మారడంతో జూపూడి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేశారు. దీంతో వైసీపీ సమన్వయకర్తగా వరికూటి అశోక్‌బాబును అధిష్టానం నియమించింది. నాలుగేళ్ల పాటు సమన్వకర్తగా ఉన్న అశోక్ బాబును పార్టీ అధిష్టానం ఆర్థిక కార‌ణాలు సాకుగా చూపించి ఆయనను ఇంచార్జీగా తొలగించి మాదాసి వెంకయ్యను నియమించింది.

దీంతో ఆగ్రహానికి గురైన వరికూటి ఆమరణ నిరాహారదీక్షకు దిగడంతో వైసీపీలో వివాదం రాజుకుంది. అయితే విజయసాయిరెడ్డి, బాలినేని వంటి నేతలు అశోక్ బాబుకు దన్నుగా నిలవడంతో .. మాదాసి వెంకయ్య తన ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. జగన్ స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే తాను పార్టీలోకి వచ్చాను కాబట్టి .. తనకే సీట్ కన్ఫామ్‌ అని ధీమాగా ఉన్నారు. ఇలా అశోక్ బాబు, వెంకయ్యల మధ్య టికెట్ విషయంలో పోటీ నెలకొంది.కొండ‌పిలో విపక్షం పోరు ఇలా ఉంటే అధికారపక్షం అభివృద్ది మంత్రంతో దూసుకుపోతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే వీరాంజనేయస్వామికి ప్ర‌జ‌ల్లో మంచి పేరుంది. దీనికి తోడు అంత‌ర్గ‌త విభేదాలు నిన్న మొన్న‌టి దాకా ఉన్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు సూచ‌న‌ల‌తో అవ‌న్నీ స‌మ‌సి పోయాయి. దీంతో ఇక్క‌డ టీడీపీ పుంజుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్వామి గెలుపు న‌ల్లేరుమీద న‌డ‌కే అని ఆయ‌న మెజార్టీ మీదే లెక్క‌లు వేసుకోవాల‌న్న చ‌ర్చ‌లు నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా వినిపిస్తున్నాయి.