లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై తేల్చేసిన సుమలత.. జేడీఎస్‌కు షాక్‌

వచ్చే లోక్‌సభ ఎన్నికల నుంచే తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుడతానని, కాంగ్రెస్‌ పార్టీ నుంచే పోటీ చేస్తానని అంబరీష్‌ భార్య సుమలత తేల్చి చెప్పారు. నాగమంగలలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. సుమలత రాజకీయ ప్రవేశంపై నెల రోజులుగా చర్చలు సాగుతున్నాయి. అంబరీష్‌ సొంత జిల్లా అయిన మండ్య నుంచి పోటీ దాదాపు ఖరారైనా ఏ పార్టీ నుంచి బరిలోకి దిగాలనే ఉత్కంఠ ఉండేది.

కొందరు జేడీఎస్‌ ద్వారాను, మరికొందరు కాంగ్రెస్‌ ద్వారాను.. లేదా స్వతంత్రంగా అయినా పోటీ చేయాలని డిమాండ్‌ చేసేవారు. అయితే సుమలత కాంగ్రెస్‌ పార్టీ నుంచే పోటీ చేస్తానని అంబరీష్‌ ఆశయం కూడా కాంగ్రెస్‌లో ఉండడమేనని స్పష్టం చేయడంతో జేడీఎస్‌కు షాక్‌ ఇచ్చినట్లయ్యింది. ఇదిలా ఉండగా ఆదివారం మండ్య జిల్లా ఆదిచుంచనగిరి మఠంలో నిర్మలానందనాథ స్వామిజీని సుమలత, కుమారుడు అభిషేక్‌తో కలసి ఆశీర్వాదం పొందారు. రాజకీయ ప్రస్తావన లేదని ఆమె తేల్చి చెప్పారు.