‘మాయావతే మా ప్రధానమంత్రి అభ్యర్థి’

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతే తమ ప్రధానమంత్రి అభ్యర్థని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సూచనప్రాయంగా శనివారంనాడు తెలిపారు. యూపీ లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్‌పీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నట్టు అఖిలేష్ యాదవ్, మాయవతి ఇవాళ సంయుక్త మీడియా సమావేశంలో ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా మాయావతికి మద్దతిస్తారా అని అఖిలేష్‌ను అడిగినప్పుడు ‘పలువురు ప్రధాన మంత్రి అభ్యర్థులను దేశానికి అందించిన చరిత్ర ఉత్తరప్రదేశ్‌కు ఉంది. పీఎం అభ్యర్థిగా నేను ఎవరికి మద్దతిస్తానో మీకందరికీ తెలుసు. రాష్ట్రం నుంచి మరో ప్రధాని వస్తున్నారంటే నేను చాలా సంతోషిస్తాను’ అని అఖిలేష్ పరోక్షంగా మాయావతికే తన మద్దతన్న సంకేతాలిచ్చారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని మాయావతిని అడిగినప్పుడు ఆమె సూటిగా స్పందించలేదు. ‘సరైన సమయంలో ఆ విషయం చెబుతాను’ అని సమాధానం దాటవేశారు.