మోదీకి దిమ్మతిరిగే సవాల్ విసిరినా చంద్రబాబు

ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. టీడీపీ నేతలపై, కార్యకర్తలపై ముప్పేట దాడి చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్‌యాదవ్‌ ఇంటిపై ఐటీ దాడులు చేశారని, ఇవాళ గుంటూరులో నాని ఇంటిపై ఐటీ దాడులు చేశారని తెలిపారు. సిగ్గులేని ప్రధాని ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోరాడాలని చంద్రబాబు సవాల్ విసిరారు. దొంగ దెబ్బ తీయాలని చూస్తే భయపడేదిలేదని స్పష్టం చేశారు. వలస పక్షులు హైదరాబాద్‌ నుంచి వచ్చాయని, తితలీ తుపాను వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు… ఈ వలస పక్షులు ఎందుకు రాలేదని నిలదీశారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించేది లేదని, తన దగ్గర రౌడీయిజం చేసేందుకు వైఎస్‌కే చేతకాలేదని హెచ్చరించారు. రౌడీల తోకకట్‌ చేస్తానని, 24 బాంబులేసినా తాను భయపడలేదన్నారు. ప్రజల రక్షణకోసం తాను దేనికైనా సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు. రౌడీలు వస్తే మహిళలకు రక్షణ, భద్రత ఉండదని, ఒకాయన చంపడమో… చావడమో అంటున్నారని ఆరోపించారు. అలాంటివారిని విడిచిపెట్టేది లేదని, జైలులో పెడతామని, రౌడీలకు రౌడీగానే ఉంటానని చంద్రబాబు ఉద్ఘాటించారు. వేరేవాళ్ల పెత్తనం ఇక్కడ చెల్లదని, కుట్రదారులు ముగ్గురు ముసుగు తీసేశారని చంద్రబాబు అన్నారు.

‘‘భార్య ఒక పార్టీ… భర్త ఒక పార్టీ. బీజేపీ-వైసీపీ మధ్య భార్యభర్తల అవినాభావ సంబంధం ఉంది. ముసుగు తీసేసి పొత్తులు పెట్టుకోండి. కుట్రదారుల తీరుపై రేపు నిరసన కార్యక్రమాలు చేపడుతాం. 6వ తేదీ ఉగాది రోజు సంకల్పం చేయాలి. దుర్మార్గులు పోవాలని 7వ తేదీ దేవుళ్లను మొక్కాలి. 8వ తేదీన అందరూ బయటకొచ్చి సంఘీభావ యాత్రలు చేయాలి. 2014లో కాంగ్రెస్‌కు 2శాతం ఓట్లు కూడా రాలేదు. 2019లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి. మహిళలందరూ ఇంటింటికీ వెళ్లి వీరతిలకం దిద్దండి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ ముందుకు రావాలి. రాష్ట్ర భవిష్యత్‌ కోసమే మన యుద్ధం చేయాలి. మనం ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా రాష్ట్రం మరో బిహార్‌ అవుతుంది. రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి పోతుంది’’ అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.