మోదీకి సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి మరీ రిక్వెస్ట్ చేసిన బీజెపీ ముఖ్యనేత

మోదీకి సపోర్ట్ చేయొద్దని ఎల్‌కే ఆడ్వాణీగారు చేతులు జోడించి మరీ తనను రిక్వెస్ట్ చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రజాశాంతి పార్టీ వ్యవహారాల గురించి తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ.. 2014లో తాను మద్దతు ఇవ్వడం వల్లే మోదీ ప్రధాని అయ్యారని చెప్పారు. మోదీయే తన వద్దకు వచ్చి అడగడం, సెక్యులరిజం అని చెప్పడంతో ప్రచారం చేశానన్నారు.

‘‘మీరు బీసీ, నేను బీసీ. నాకు ఫ్యామిలీ లేదు. మీకూ ఫ్యామిలీ లేదు. దేశమే మన ఫ్యామిలీ. ఇద్దరం కలిసి దేశాన్ని అభివృద్ధి చేద్దామని గంటా నలభైఐదు నిమిషాలపాటు నాతో చర్చించారు. బీజేపీ ప్రెసిడెంట్లు, సెక్రెటరీలు, ట్రెజరర్లు.. ఇలా అందరినీ అమెరికా పంపించి.. మసాజ్ చేసి.. రిక్వెస్ట్ చేసి.. ఇది చేసి, అది చేసి ఎంతగా నన్ను వేడుకున్నారంటే.. ఒక చిన్న కుర్రాడిలా మోదీ బిహేవ్ చేశారు.

అయితే ఆడ్వాణీగారు మాత్రం వద్దన్నారు. 2013 అక్టోబర్ 1న చేతులు జోడించి గంటన్నరపాటు చెప్పారు. మోదీకి సపోర్ట్ చేయొద్దు. అతను ఒక్క హామీని కూడా నెరవేర్చడని చెప్పారు. ఆయనే తన ఇంటికి డిన్నర్‌కు పిలిచి ఈ విషయం చెప్పారు. నేను మోదీగారి ఇంటికి వెళ్లలేదు. ఆయనే నా దగ్గరికి వచ్చారు. కానీ ఆడ్వాణీగారి ఇంటికి వెళ్లాను.’’ అని కేఏ పాల్ వెల్లడించారు.