మోడీపై రాహుల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ఓ వ్యాఖ్య ఆయనను వివాదంలో పడేసింది. లోక్‌సభలో మూడ్రోజుల కిందట రాఫెల్‌ వివాదంపై జరిగిన చర్చ గురించి ప్రస్తావిస్తూ… ‘‘విశాలమైన 56 అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకున్న మన చౌకీదారు- తనను కాపాడే బాధ్యతను ఓ మహిళకు వదిలేశారు. నిర్మలా సీతారామన్‌జీ! నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నాను… మీరే నన్ను కాపాడాలి.. అని ఆమెను ముందుకు నెట్టి- చర్చ నుంచి పారిపోయారు’’ అని రాహుల్‌ బుధవారం జైపూర్‌లో ఓ సభలో వ్యాఖ్యానించారు.

‘‘రెండున్నర గంటల పాటు ఆమె ప్రధానిని సమర్థించారు. కానీ నేను అడిగిన ఒకే ఒక ప్రశ్నకు అవును లేదా కాదు అని సమాధానమివ్వాలని కోరినపుడు ఆమె బదులివ్వలేకపోయారు’ అని రాహుల్‌ పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ‘‘ఒక మహిళకు వదిలి…’’ అని రాహుల్‌ అనడాన్ని తప్పుబడుతూ- ‘ఇది కేవలం రక్షణమంత్రిని అవమానించడమే కాదు. యావత్‌ మహిళా లోకాన్ని, నారీశక్తిని కించపర్చే వ్యాఖ్య. ఇలాంటి బాధ్యతారహిత నేతలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే’’ అని ఆగ్రా సభలో అన్నారు. కానీ రాహుల్‌ తన వ్యాఖ్యపై వెనక్కి తగ్గలేదు.

బుధవారం రాత్రి మరో ట్వీట్‌ చేస్తూ- ‘‘మహిళను గౌరవించడమనేది ఇంటి నుంచే మొదలవుతుంది. మోదీజీ! వణికిపోకండి… ఒక మనిషిగా నేనడిగే దానికి బదులు చెప్పండి. రాఫెల్‌ మొదటి ఒప్పందాన్ని మీరు తిరస్కరించినపుడు వైమానిక దళం, రక్షణ శాఖ అభ్యంతరం చెప్పాయా? లేదా? సమాధానమివ్వండి’’ అని నిలదీశారు. కాగా, నిర్మలపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై వివరణ కోరుతూ గురువారం నాడు రాహుల్‌కు నోటీసు జారీచేయనుంది.