ఏపీ ఈ దేశంలో భాగం కాదా.. మోదీకి రాహుల్ సూటి ప్రశ్న

ఆంధ్రాభవన్‌లో దీక్ష చేపట్టిన సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా మోదీ విశ్వసనీయత కోల్పోయారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లేదో చెప్పాలని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా అన్నారు. గత ప్రధాని ఇచ్చిన హామీలను ఈ ప్రధాని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే ‘‘ఏపీ ప్రజలకు అండగా ఉంటాను. ఎక్కడికి వెళితే అక్కడ మోదీ అబద్దాలు మాట్లాడుతున్నారు. ఆయనపై నమ్మకం పోయింది. ఈ దేశ ప్రజల సెంటిమెంట్ ఎలా ఉంటుందో రెండు నెలల్లో చూపిస్తాం. రఫేల్‌ గురించి పత్రికల్లో ఏ వార్త వచ్చిందో తెలియదా.. చౌకీదార్ చోర్ అయ్యాడు. ఏపీ ప్రజల సొమ్మును .. అనిల్ అంబానీకి దోచి పెట్టారు. మోదీని, బీజేపీని ఓడిద్దాం’’ అంటూ రాహుల్ పిలుపునిచ్చారు. అంతకుముందు చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన .. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.