నంద‌మూరి మ‌ల్టీస్టార‌ర్‌

అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన మనం సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. దివంగ‌త లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు చివ‌రి చిత్రంగా తెర‌కెక్కిన మ‌నం ఆయ‌న‌కు నిజ‌మైన ఘ‌న‌నివాళిగా చెప్పుకోవాలి. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సాధించిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. ఇక మ‌నం సినిమా వ‌చ్చాక ఈ తరహా ఫ్యామిలీ మల్టీ స్టారర్‌లు చేసేందుకు చాలా మంది ఇంట్రస్ట్‌ చూపించారు.ఒక విధంగా చెప్పాలంటే మ‌నం త‌ర్వాత సీనియ‌ర్ హీరోలు, టాలీవుడ్‌లో టాప్ ఫ్యామిలీల హీరోలు సైతం మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయాల‌ని వారి అభిమానులు సైతం ఉత్సాహంతో ఉన్నారు. మ‌నం త‌ర్వాత జ‌నాలు ఎక్కువుగా ఆస‌క్తి చూపించేంది నంద‌మూరి ఫ్యామిలీ హీరోల మ‌ల్టీస్టార‌ర్‌. అయితే ఈ మ‌ల్టీస్టార‌ర్ విష‌యంలో హీరోలు సుముఖంగా ఉన్నా స‌రైన క‌థ‌ల‌తో పాటు ఇత‌ర‌త్రా కార‌ణాల వల్ల ఇది ప‌ట్టాలెక్క‌డం లేదు.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం ఇప్పుడు నంద‌మూరి ఫ్యామిలీ మల్టీ స్టారర్‌ తెరమీదకు రానుందట. నందమూరి ఫ్యామిలీకి చెందిన ముగ్గురు స్టార్లు ఒకే సినిమాలో కలిసి నటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. నంద‌మూరి ఫ్యామిలీ నిర్మాత కం హీరో అయిన క‌ళ్యాణ్‌రామ్ గ‌తేడాది ద‌స‌రాకు జై ల‌వ‌కుశ లాంటి హిట్ సినిమాతో త‌న బ్యాన‌ర్ వేల్యూను పెంచాడు. ఇప్పుడు క‌ళ్యాణ్ ఎమ్మెల్యే, నా నువ్వే సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమాల తరువాత పవన్‌ సాధినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ సినిమాను కళ‍్యాణ్ రామ్‌ తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌ సోదరుడు ఎన్టీఆర్‌, తండ్రి హరికృష్ణలు అతిథి పాత్రల్లో నటించనున్నారట. ఈ వార్తలపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. మ‌రి ఈ తండ్రి ఇద్ద‌రు కొడుకుల‌ను ఒకేసారి స్క్రీన్ మీద చూసుకోవ‌డం అంటే నంద‌మూరి అభిమానుల్లో జోష్ మామూలుగా ఉండ‌దుగా..!