‘ నిమ్మ‌ల‌ ‘ మార్క్ డ‌వ‌ల‌ప్‌మెంట్‌… ఐదేళ్ల పాలకొల్లు అభివృద్ధి @ 1200 కోట్లు…

ఇది ఈ ఐదేళ్లు పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేసిన అభివృద్ధి లెక్క. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రామానాయుడు….మంచి చదువు చదువుకుని…..తండ్రి పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి….ప్రజలకి సేవ చేస్తూ…టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఎంటర్ అయి 2014లో పాలకొల్లు టికెట్ దక్కించుకుని తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారు. అయితే ఈ ఐదేళ్లలోనే 1200 కోట్లు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని రామానాయుడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా చెబుతూ వస్తున్నారు. టౌన్ రహదారులు, అప్రోచ్ రోడ్లు, సి‌సి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం, తాగునీటి సమస్య పరిష్కరించడం, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం, ఎన్టీఆర్ హౌసెస్, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, త్రాగునీరు, సాగు నీరు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌లు ఏర్పాటు చేయడం లాంటివి చేశారు.

ఇవేగాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశానని…అలాగే ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ.. ఏ సమస్య ఉన్న పరిష్కరించానని అంటున్నారు. అటు తనని గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేస్తాను అనే విషయాన్ని కూడా ఆయన వివరిస్తున్నారు. రానున్న రోజుల్లో పాలకొల్లుని మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని…తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 198 కోట్లతో విజ్జేశ్వరం నుంచి పైప్ లైన్ ద్వారా గోదావరి జలాలని తీసుకోస్తానని, అలాగే గ్రామాల్లో తాగునీటి సమస్యకు 69 కోట్లు కేటాయిస్తానని చెబుతున్నారు. ఆధునిక వైద్యానికి డయాలసిస్, ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు, 50 పడకల ఆసుపత్రిని 12.60 కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా చేయడానికి ఇప్పటికే నిధులు మంజూరు చేయించానని…మళ్ళీ అధికారం చేపట్టిన వెంటనే పనులు ప్రారంభిస్తానని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే రామానాయుడు పార్టీని బలోపేతం చేయడంలో కూడా ఎనలేని కృషి చేశారు. కార్యకర్తలకి అందుబాటులో ఉంటూ…వారికి అన్నీ విధాలుగా అండగా నిలిచారు. అసలు టీడీపీ కార్యకర్తలు అత్యంత సంతృప్తిగా ఉన్న నియోజకవర్గాల్లో పాలకొల్లు ముందు వరుసలో ఉంటుంది. అలాగే పార్టీ సభ్యత్వ నమోదులో చివరి మూడు సార్లు రాష్ట్రంలోనే నెంబర్‌1గా ఉన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం కంటే ఎక్కువ సభ్యత్వాలు పాలకొల్లులోనే నమోదు కావడం విశేషం. అటు అభివృద్ధి, ఇటు పార్టీ బలోపేతం చేయడంలో ముందువరుసలో ఉన్న తనని పాలకొల్లు ప్రజలు మళ్ళీ గెలిపిస్తారని రామానాయుడు ధీమాగా ఉన్నారు. ఇక ఆయన పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్న ప్రజలు కూడా మరోసారి రామనాయుడుకి పట్టం కట్టేందుకు సిద్ధంగానే ఉన్నట్లు కనబడుతోంది.