పార్లమెంట్‌లో గర్జించిన రామ్మోహన్‌

కేంద్రం ఏపీకి తీరని ద్రోహం చేసిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. నాలుగున్నరేళ్లుగా కేంద్రం తీవ్ర జాప్యం చేసిందన్నారు. ఏపీ సమస్యలపై, నిన్న గుంటూరులో ప్రధాని మోదీ చేసిన విమర్శలను ఆయన పార్లమెంట్‌లో ప్రస్తావించారు. రైల్వేజోన్ హామీని కేంద్రం తుంగలో తొక్కిందన్నారు. ఇప్పటి వరకు కనీసం ఒక్క మీటింగ్ పెట్టలేదని ఆయన విమర్శించారు. ఏపీలో వెనుకబడిన జిల్లాల కోసం రూ. 350 కోట్లు అకౌంట్‌లో వేసి… ఆ తర్వాత రాజకీయ కక్షతో కేంద్రం వెనక్కి తీసుకుందని రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. ఇంతటి దారుణం ఎప్పడూ జరగలేదని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తనను విమర్శిస్తున్నారని మోదీ అనడం దారుణమని రామ్మోహన్‌నాయుడు అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదని, ఆయన ఎప్పుడూ ఏపీ కోసమే మాట్లాడారన్నారు. ఏపీకి చేయాల్సిన సాయం కేంద్రం చేసి ఉంటే.. తాము మాట్లాడాల్సి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఇలా ధర్మపోరాట దీక్షల వరకు వచ్చేది కాదన్నారు.