రాజుగారి గది 2 రివ్యూ

టైటిల్: రాజు గారి గది 2,జానర్: హర్రర్ థ్రిల్లర్,న‌టీన‌టులు: నాగార్జున, సమంత, సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిశోర్, అభినయ, నందు,సినిమాటోగ్ర‌ఫీ: దివాక‌ర‌న్‌, సంగీతం : ఎస్.థ‌మన్, నిర్మాతలు: ప్రసాద్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి, నిరంజన్ రెడ్డి, దర్శకత్వం: ఓంకార్, రిలీజ్ డేట్‌: 13 అక్టోబ‌ర్‌, 2017

రాజు గారి గ‌ది సినిమాతో ఒక్క‌సారిగా స్టార్ యాంక‌ర్‌గా ఉన్న ఓంకార్ కాస్త క్రేజీ డైరెక్ట‌ర్‌గా మారిపోయాడు. ఓంకార్‌లో డైరెక్ష‌న్ స్కిల్స్ చూసిన స్టార్ హీరోలు సైతం షాక్ అయ్యారు. రెండేళ్ల క్రింద‌ట దీపావళికి వ‌చ్చిన ఈ సినిమా రాజు గారి గ‌ది సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు ఏకంగా రూ.20 కోట్ల‌కు పైగా షేర్ కొల్ల‌గొట్టింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ఓంకార్ రాజు గారి గ‌ది 2ను తెర‌కెక్కించాడు. ముందు సినిమాలో ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండా హిట్ కొట్టిన ఓంకార్ ఈ సినిమా కోసం మాత్రం నాగార్జున‌, స‌మంత, శీర‌త్‌క‌పూర్ లాంటి వాళ్లను తీసుకున్నాడు. రిలీజ్‌కు ముందే ప్రి రిలీజ్ బిజినెస్‌తో భారీ లాభాలు సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. మ‌రి రాజు గారి గ‌దిలా ఈ రాజు గారి గ‌ది 2 మెప్పించిందా ? లేదా ? అన్న‌ది డెక్క‌న్‌రిపోర్ట్‌.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థేంటి….
ముగ్గురు ఫ్రెండ్స్ అయిన అశ్విన్ (అశ్విన్ బాబు), కిశోర్ (వెన్నెల కిశోర్), ప్రవీణ్ (ప్రవీణ్) బాగా సెటిల్ అవ్వాల‌ని ఓ బిజినెస్ మొదలు పెడతారు. విశాఖపట్నం బీచ్ లో ఉండే రాజుగారి బంగ్లా కొని అందులో రిసార్ట్ స్టార్ట్ చేస్తారు. రిసార్ట్ కు వచ్చిన సుహాని (సీరత్ కపూర్) మీద కిశోర్, ప్రవీణ్ మ‌న‌స్సు ప‌డి ఆమెతో డేట్ చేయాల‌ని ఆమెను ముగ్గులోకి దింపే ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఈ టైంలో వాళ్ల‌కు రిసార్ట్‌లో దెయ్యం ఉంద‌ని సందేహం రావ‌డంతో వాళ్లు ఓ చ‌ర్చి ఫాద‌ర్ (న‌రేష్‌)ను క‌ల‌వ‌డం ఆయ‌నకు కూడా అక్క‌డ దెయ్యం ఉంద‌ని అనుమానం రావ‌డంతో చివ‌ర‌కు వాళ్లంతా వ‌ర‌ల్డ్‌లోనే టాప్ మెంట‌లిస్ట్ నిపుణుడు అయిన రుద్ర (నాగార్జున‌) ద‌గ్గ‌ర‌కు వెళ‌తారు. రుద్ర పోలీసులు సాల్వ్ చేయ‌లేని కేసుల్లో వారికి స‌హాయ‌ప‌డుతుంటాడు. రుద్ర రిసార్ట్ వెళ్లి అక్క‌డ ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని ఆత్మ ఉంద‌ని నిర్ధారించుకుంటాడు. ఆ స‌మ‌యంలో రుద్ర‌కు కూడా అనుకోని ప‌రిణామం ఎదుర‌వుతుంది. అస‌లు అంద‌రినీ భ‌యపెట్టే ఆత్మ ఎవ‌రు ? ఆమె ఎందుకు అంద‌రినీ ఇబ్బంది పెడుతుంటుంది ? అమృత (స‌మంత‌) ఎవ‌రు ? రుద్ర‌, అమృత‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి అన్న‌దే ఈ రాజు గారి గ‌ది 2 స్టోరీ.

న‌టీన‌టుల ప‌నితీరు & విశ్లేష‌ణ :
నాగార్జున మోడ్రన్‌ సెయింట్‌ రుద్ర పాత్రలో ఇమిడిపోయారు. హావ‌భావాలతోనూ తన డైలాగ్‌ స్టైల్‌తోనూ హీరోయిజాన్ని పండించారు. సమంత, లా చదువుకున్న అమ్మాయిగా చక్కగా నటించింది. బ‌బ్లీ గ‌ర్ల్‌గాను, దెయ్యంగాను రెండు విభిన్న పాత్ర‌లో స‌మంత పాత్ర సూప‌ర్‌. నాగ్‌కు త‌న విభిన్న ప్ర‌య‌త్నంలో ఇదో మంచి ప్ర‌య‌త్నం. ఒక ఆత్మ ఆ ఆత్మకి సాయంగా నిలిచిన ఓ మెంటలిస్ట్‌ కథే ఈ చిత్రం. హారర్‌ కామెడీ నేపథ్యంతో కూడుకున్న చిత్రమే అయినా, ఓ మంచి సందేశంతో తీర్చి దిద్దారు. సినిమా మామూలుగానే స్టార్ట్ అయినా దెయ్యం భ‌య‌పెట్ట‌డం నుంచి ఊపందుకుంటుంది. ఫ‌స్టాఫ్ మొత్తం పెద్ద‌గా ఎంగేజ్ చేయ‌దు. ఫ‌స్టాఫ్ సీన్ల‌న్ని చాలా వ‌ర‌కు కిశోర్‌, అశ్విన్‌, ప్రవీణ్‌తో పాటు శీర‌త్‌క‌పూర్ అందాల ఆర‌బోతతోనే న‌డుస్తాయి. ఇక సెకండాఫ్‌లో వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు మెయిన్ ఎస్సెట్‌. అమృత పాత్ర‌లో స‌మంత న‌ట‌న‌, నాగార్జున‌కు – స‌మంత‌కు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు, మ‌న‌స్సుకు హ‌త్తుకునే ఎమోష‌న‌ల్ సీన్లు, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ జీవితం ఎలాంటిది ? క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడు వాళ్లు ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి లాంటి అంశాల‌న్ని సెకండాఫ్‌లో చ‌క్క‌గా కుదిరాయి. ఇక ఓంకార్ మ‌ళ‌యాళ మాతృక నుంచి చిన్న‌లైన్ తీసుకుని దానిని తెలుగు నేటివిటికి అనుగుణంగా అందులోను నాగార్జున‌, స‌మంత లాంటి స్టార్ కాస్టింగ్‌కు త‌గిన క‌థ‌గా రూపొందించ‌డంలో బాగా స‌క్సెస్ అయ్యాడు. సినిమాను కుటుంబ స‌మేతంగా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూసే సినిమాగా తీర్చిదిద్దాడు. దీంతో ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంది. ఇక మైన‌స్‌ల విష‌యానికి వ‌స్తే ఫ‌స్టాఫ్‌లో సీన్లు సాదాసీదాగా ఉండ‌డం, కామెడీ త‌గ్గ‌డం, ద‌ర్శ‌కుడు ఓంకార్ త‌న తమ్ముడు అశ్విన్‌ని హీరోగా ప్రమోట్ చేయడం కోసం ఓంకార్ చేసిన కొన్ని జిమ్మిక్కులు చికాకుగా ఉంటాయి.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:
టెక్నికల్‌గా సినిమా కొన్ని అంశాల్లో బాగానే ఉంది. గ్రాఫిక్స్ జస్ట్ ఓకే. దివాక‌ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హ‌ర్ర‌ర్ మూడ్ తీసుకువ‌చ్చింది. ఇక థ‌మ‌న్ పాట‌లు బాగోలేవు. సెకండాఫ్‌లో మాత్రం ఆర్ ఆర్ అదిరిపోయింది. హ‌ర్ర‌ర్ మూడ్‌లో సీన్ల‌ను బాగా ఎలివేట్ చేసింది. అబ్బూరి ర‌వి క‌లం నుంచి వ‌చ్చిన డైలాగులు పేలాయి. హృద్యంగా కూడా ఉన్నాయి. ఇక నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ఓంకార్ డైరెక్ష‌న్ ఎలా ఉందంటే…
రాజు గారి గ‌ది సినిమా తెర‌కెక్కించిన‌ప్పుడు క‌థ న‌డిపించే విష‌యంలో స్ట్రైట్ ఫార్వ‌ర్డ్‌గా ముందుకు వెళ్లిన ఓంకార్ ఈ సినిమా కోసం స్టార్ కాస్టింగ్‌ను కూడా రంగంలోకి దించాడు. క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ఫార్మాట్ నేప‌థ్యంలో కొన్ని చోట్ల ట్రాక్ త‌ప్పినా ఫైన‌ల్‌గా మెప్పించాడు. ఫ‌స్టాఫ్‌లో కామెడీ డోస్ త‌క్కువైనా శీర‌త్‌క‌పూర్ స్కిన్ షో, ముగ్గురు కమెడియ‌న్ల‌తో బండి లాగించాడు. నాగార్జున క‌థ‌లోకి ఎంట‌ర్ అయ్యే వ‌ర‌కు క‌థ ఊపందుకోలేదు. సెకండాఫ్‌లో నాగ్ – స‌మంత సీన్లు బాగా డీల్ చేసిన ద‌ర్శ‌కుడు, కీల‌క‌మైన క్లైమాక్స్‌ను బాగా ప్ర‌జెంట్ చేసి మంచి సందేశం ఇచ్చాడు.

ప్ల‌స్‌లు (+): నాగార్జు – స‌మంత న‌ట‌న‌, థ‌మ‌న్ ఆర్ ఆర్‌, ఓంకార్ డైరెక్ష‌న్‌, ఎమోష‌న‌ల్ సీన్లు, సెకండాఫ్‌

మైన‌స్‌లు (-): డోస్ త‌గ్గిన కామెడీ, రాజు గారి గ‌ది రేంజ్‌లో లేక‌పోవ‌డం, ఫ‌స్టాఫ్‌లో కొన్ని సీన్లు

రాజు గారి గ‌ది 2 డెక్క‌న్‌రిపోర్ట్‌.కామ్ రేటింగ్‌: 3 / 5