ఓడినా.. ఆయ‌నే హీరో.. సోమిరెడ్డి పొలిటిక‌ల్ లైఫ్ డిఫ‌రెంట్‌

రాజ‌కీయాల్లో ప‌ద‌వులు ప‌ర‌మావ‌ధి! ఏ నేత‌కైనా కూడా ఏ పార్టీలో అయినా సీటు రాజ‌కీయాలే కీల‌కం. ఇక‌, పార్టీల‌కు కూడా నేత‌లతో త‌మ‌కు ల‌భించే ప్ర‌యోజ‌న‌మే ప‌ర‌మార్థం. ఈ విష‌యంలో ఎవ‌రు ఎవ‌రికీ అతీతులు కాబోరు. అయితే, నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి పొలిటిక‌ల్ లైఫ్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. న‌మ్మిన విలువ‌ల కు, సిద్ధాంతాల‌కు క‌ట్టుబడిన నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న ప్ర‌తి అడుగునూ విశ్వ‌స‌నీయ‌త‌వైపే వేశారు. టీడీపీ రాజ‌కీయాల్లోకి 1990ల‌లోనే అడుగు పెట్టిన సోమిరెడ్డి.. ఇన్నేళ్ల పార్టీకి ఎంతో అంకిత భావాన్నే ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చారు. పార్టీ ప‌ట్ల విధేయ‌త‌, పార్టీ కార్య‌క్ర‌మాల ప‌ట్ల అంకిత భావం వంటి వి ఆయ‌న‌కు పార్టీకి మ‌ధ్య ద్రుఢ‌మైన బందాన్ని ఏర్పాటు చేశాయి.

1994, 1999 ఎన్నిక‌ల్లో స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన సోమిరెడ్డి.. అద్భుత విజ‌యాన్ని అందుకున్నారు. అయితే, ఆ త‌ర్వాత ఇక్క‌డ మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో వెనుక‌బ‌డుతున్నారు. అయినా కూడా పార్టీని ఇక్క‌డ బ‌లోపేతం చేయ‌డంలో సోమిరెడ్డి పాత్ర గ‌ణ‌నీయం. ఎక్క‌డా ఎలాంటి విభేదాలు రాకుండా, నాయ‌కుల‌ను అంద‌రినీ క‌లుపుకొని పోతూ ఆయ‌న పార్టీని ఇక్క‌డ నిల‌బెడుతున్నారు. 2014లోనూ స‌ర్వేప‌ల్లి నుంచి పోటీ చేసినా కేవ‌లం 5 వేల ఓట్ల తేడాతో ఆయ‌న విజ‌యానికి దూర‌మ‌య్యారు. అయినా కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డంలోను ప్ర‌జ‌ల‌ను కూడ‌గ‌ట్ట‌డంలోను ఆయ‌న విజ‌యం సాధించారు.

వాస్త‌వానికి నెల్లూరు జిల్లాలో అనేక వ‌ర్గ రాజ‌కీయాలు ఉన్నాయి. పార్టీలో ప‌ద‌వులు ల‌భించ‌ని వారు వేరే పార్టీల్లోకి జంప్ చేసిన సంద‌ర్భాలు కూడా కోకొల్లలు. కానీ, సోమిరెడ్డి ఏనాడూ అలాంటి వ‌ర్గాల‌ను ప్రోత్స‌హించ‌లేదు. పైగా అవినీతి అన్న‌ది ఆయ‌న చ‌రిత్ర‌లో లేకుండా ముందుకు సాగారు. ఇదే.. చంద్ర‌బాబుకు సోమిరెడ్డికి మ‌ధ్య ఫెవికాల్ మాదిరిగా మారి.. వీరిద్ద‌రి మ‌ధ్య అనుబంధాన్ని పెంచింది. పార్టీకి గ‌ట్టివాయిస్ వినిపించ‌డంలోనూ సోమిరెడ్డి విజ‌యం సాధిస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఈయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌విని ఇవ్వ‌డంతోపాటు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ స‌మ‌యంలో వ్య‌వ‌సాయ శాఖ‌ను అప్ప‌గించారు. దీంతో సోమిరెడ్డి త‌న స‌త్తా చాటుతున్నారు. ఇక‌, క‌డ‌ప జిల్లా టీడీపీ బాధ్య‌త‌ల‌ను కూడా సోమిరెడ్డికే అప్ప‌గించారు చంద్ర‌బాబు. రెండేళ్ల కింద‌ట ఇక్క‌డ జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సోమిరెడ్డి త‌న స‌త్తాచాటి టీడీపీ జెండా ఎగిరేలా చేశారు. ఇలా పార్టీ కోసం.. త‌ను ఎంత చేయాలో అంత‌కు ఒక అంగుళం ఎక్కువ‌గానే క‌ష్ట‌ప‌డుతూ. అధినేత దృష్టిలో మంచి మార్కులు వేయించుకున్నారు సోమిరెడ్డి!