అమ‌రావ‌తిలో ద‌శావ‌తార వెంక‌న్న ఆల‌యం.. 22న కుంభాభిషేకం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత దేవునిగా పూజ‌లందుకుంటున్న శ్రీవేంక‌టేశ్వ‌రుని వైభ‌వం గురించి తెలియ‌నివారు ఎవ‌రుంటారు? జీవితంలో ఒక్క‌సారైనా.. ఆయ‌న ఆల‌యాన్ని ద‌ర్శించాల‌ని కోరుకోనివారు ఎవ‌రుంటారు? అందుకే ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌లకు ఓర్చుకుని నిత్యం కొన్ని ల‌క్ష‌ల మంది తిరుమ‌ల బాట‌ప‌డుతున్నారు. ఎక్క‌డెక్క‌డి నుంచో నిద్రాహారాలు మానుకుని మ‌రీ.. వెంక‌న్న ద‌ర్శ‌నానికి వ‌స్తున్నారు. క్ష‌ణ‌కాలంలో వందో వంతు మాత్ర‌మే ల‌భించే ఆ కోనేటి రాయుని ద‌ర్శ‌నం కోసం త‌పించిపోతారు. గ‌దులు దొరికినా దొర‌క‌క‌పోయినా.. వాతావ‌ర‌ణం.. శ‌రీరాన్ని బాధిస్తున్నా.. మ‌న‌సు మాత్రం ఆ అయ్య‌పైనే నిలిపి.. గోవిందా.. గోవిందా.. అంటూ అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ‌నాయ‌కునిని క‌న్నులార ద‌ర్శించుకుని పుల‌కించి పోతారు.

అయితే, వేంక‌టేశ్వ‌రుడు ఒక్క తిరుమ‌ల‌లోనే ఉన్నారా? అంటే.. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. ఇత‌ర రాష్ట్రాలు స‌హా అమెరికా, బ్రిట‌న్ వంటి విదేశాల్లోనూ ఆప‌ద మొక్కుల వాని ఆల‌యాలు కొలువుదీరాయి. అయితే, ఆయా ఆల‌యాల్లోని మూర్తి.. ఏక‌రూపంతో.. ప్ర‌జ‌ల‌ను ఆశీర్వ‌దిస్తున్న రూపంలోనే ద‌ర్శ‌న‌మిస్తున్నారు. అయితే, దీనికి భిన్నంగా స్వామి రూపాన్ని ద‌ర్శించుకోవాల‌నే వారికి ఇప్పుడు అమ‌రావ‌తిలో నూత‌న ఆల‌యం నిర్మిత‌మ‌వుతోంది. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత గురుతుల్యు లు.. మ‌ర‌క‌త రాజ‌రాజేశ్వ‌రి ఉపాస‌కులు.. గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామి.. ఈ మ‌హోన్న‌త కార్యానికి శ్రీకారం చుట్టారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఏపీ రాజ‌ధాని న‌గ‌రం అమ‌రావ‌తిలో ద‌శావ‌తార శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌య నిర్మాణాన్ని చేప‌ట్టాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. తాజాగా ఇదే విష‌యాన్ని ఆయ‌న మీడియా ద్వారా అశేష భ‌క్త జ‌నానికి శుభ‌వార్త అందించారు.

సాక్షాత్తూ.. తిరుమ‌ల‌లోని శ్రీవారి ఆల‌యాన్ని త‌ల‌పించే విధంగా అమ‌రావ‌తిలో 4 ఎక‌రాల్లో.. ఈ నూత‌న ఆల‌యాన్ని నిర్మించ‌నున్న‌ట్టు స్వామి తెలిపారు. ఈ నిర్మాణాన్నితానే స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. అస‌లు ఇక్క‌డ ఆల‌యాన్ని నిర్మించాల‌నే ఆలోచ‌న ఎలా వ‌చ్చింది? అన్న ప్ర‌శ్న‌కు ఆ శ్రీవారే త‌న‌కు ఈ అవ‌కాశం క‌ల్పించార‌ని స‌చ్చిదానంద స్వామి వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా ఈ ఆల‌య నిర్మాణ ప్ర‌చోద‌నంపై ఆయ‌న ఆస‌క్తిక‌ర అంశాల‌ను వెల్ల‌డించారు. అవి ఆయ‌న మాట‌ల్లోనే.. “మైసూరులో ఉన్న‌ప్పుడు అక్క‌డి శ్రీవారి ఆల‌యంలో ఏకాద‌శిరోజు పూజ ముగించుకుని విజ‌య‌వాడ చేరుకున్నాను. అప్పుడు గ‌ణ‌ప‌తి ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి. ఆ స‌మ‌యంలో లింగ‌మ‌నేని పూర్ణ‌భాస్క‌ర‌రావుగారు న‌న్ను క‌లిశారు. నాకు ఓ కేలండ‌ర్ అందించారు. ఆ కేలండ‌ర్‌లో ఉన్న విధంగానే శ్రీవారి ద‌శావ‌తార మూర్తిని లోహంతో త‌యారు చేయించారు. మైసూరులోనే దీనిని రూపొందించారు. అదే విధంగా ఉండేలా.. శ్రీవారి ద‌శావ‌తార మూర్తిని ఎక్క‌డైనా నిర్మించాల‌ని నేను నిర్ణ‌యించుకున్నాను.“ అని చెప్పారు.

“ద‌శావ‌తార శ్రీవారి ఆల‌యాన్నినిర్మించి కుంభాభిషేకం చేయ‌డంతోపాటు.. ఆల‌యాన్ని నిర్మించాల‌ని ఆనాడే నిర్ణ‌యించుకున్నాం. మ‌ర‌క‌త రాజేశ్వ‌రి స‌న్నిధిలో ఇదే విష‌యాన్ని పూర్ణ‌భాస్క‌ర‌రావుగారికి చెప్ప‌డం జ‌రిగింది. అయితే, ఓ స‌త్సంక‌ల్పం చేసుకున్న‌ప్పుడు అనేక ప‌రీక్ష‌లు వ‌చ్చిన విధంగానే మేం త‌ల‌పెట్టిన ఈ ఉత్త‌మోత్త‌మ క్ర‌తువుకు కూడా అనేక ప‌రీక్ష‌లు వ‌చ్చాయి. అయితే, ఆ యా అన్ని ప‌రీక్ష‌ల‌ను ఆ భ‌గ‌వంతుని కృప‌తో విజ‌యంతో నెగ్గుకు వ‌చ్చాం. ప్ర‌తి ఇంట్లోనూ ఆల‌యం ఉండాల‌నే స‌త్సంక‌ల్పంతో మేం ముందుకు సాగుతుంది. ఫ‌లితంగా దేశంలో హిందూ ధ‌ర్మం నిలుస్తుంది. ఆల‌య నిర్మాణంతో ధ‌ర్మం ఎప్పుడూ నిలిచి ఉంటుంది. మేం మా మ‌న‌సులోని మాట‌ను చెప్ప‌డంతో.. పూర్ణ‌భాస్క‌ర‌రావుగారు ఈ విష‌యాన్ని ఆయ‌న కుమారుడు ర‌మేష్‌కు వెల్ల‌డించారు.“

“అయిన‌ప్ప‌టికీ అనేక ప‌రీక్ష‌లు వ‌చ్చాయి. త‌ర్వాత చూస్తాం.. త‌ర్వాత చూస్తాం.. అంటూ కాలం గ‌డిచిపోయింది. అయితే, ఈ ప‌రీక్ష‌ల‌న్నింటినీ.. ఆ భ‌గ‌వంతుని కృప‌తో దాటుకుని ముందుకు వెళ్లాం. ఇప్పుడు ఇక్క‌డ ఆల‌యం నిర్మిత‌మైంది. అమ‌రావ‌తిలో ఈ ఆల‌యాన్ని నిర్మించ‌డం చాలా గ‌ర్వ‌కార‌ణం. అందునా.. ఏపీకే కాకుండా ప్ర‌పంచానికే మార్గ‌ద‌ర్శ‌నంగా ఉన్న ఈ అమ‌రావ‌తిలో నిర్మాణ‌మైనతొలి ఆల‌యంగా ఇది రికార్డు సృష్టించ‌డం మ‌రో గ‌ర్వ‌కార‌ణం. శ్రీమ‌న్నారాయ‌ణుని 21 అవ‌తారాల‌లో అత్యంత కీల‌క‌మైన 10 అవ‌తారాల‌ను ఇక్క‌డ ఏర్పాటు చేసుకున్నాం. ఇదెంతో సంతోష దాయ‌క‌మైన విష‌యం. అంద‌రికీ అన్ని క‌ష్టాలు దూరంకావాల‌ని, పాడిపంటలు బాగుండాల‌ని కోరుకుంటూ.. ఈ నెల 22న కుంభాభిషేకం నిర్వ‌హించాల‌ని ముహూర్తం నిర్ణ‌యించుకున్నాం. ఇటువంటి ఆల‌యం ఇది మొట్ట‌మొద‌టిద‌ని చెప్ప‌డంలో సందేహంలేదు. ఇది గ‌ర్వ‌కార‌ణం కూడా“

“ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు వ‌చ్చి స్వామిని ద‌ర్శించుకునే అవ‌కాశం మ‌నకు ఆ శ్రీవారే క‌ల్పించారు. వేం.. `క‌ట‌`- ఆ పేరులోనే పాపాన్ని హ‌రించే శ‌క్తి ఉన్న ఏకైక స్వ‌రూపం కావ‌డంతో ఆయ‌నను ద‌ర్శించినంత మాత్రానే క‌లి పురుషుని ద్వారా సంక్ర‌మించే పాపం మ‌న నుంచి దూర‌మై.. మ‌న‌కు మేలు క‌లుగుతుంది. ద‌శావ‌తార వేంక‌టేశ్వ‌రుని ఆల‌యానికి శుక్ర‌వారం కుంభాభిషేకం నిర్వ‌హిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ క్షిప్ర‌గ‌ణ‌ప‌తి ఆల‌యం, గ‌రుడాళ్వార్‌, ప‌ద్మావ‌తి స్వ‌రూప‌మైన ల‌క్ష్మీదేవి.. వంటి ప‌లు ఆల‌యాల‌ను ఇక్క‌డ ఏర్పాటు చేయ‌డం ద్వారా.. అంద‌రి మూర్తుల‌ను ఒకే ప్రాంగ‌ణంలో ద‌ర్శించుకునే అవ‌కాశం మన‌కు ల‌భిస్తోంది. విజ‌య‌వాడ‌-గుంటూరు జాతీయ ర‌హ‌దారికి స‌మీపంలో కృష్ణాన‌ది స‌మీపంలో ఏర్పాటైన ఈ ఆల‌యం.. దాదాపు 18 ఏళ్ల కృషితో ఏర్పాటైంది. దీనిని ద‌ర్శించుకోవ‌డం ద్వారా స‌క‌ల పాప‌రాశి ధ్వంస‌మైపోతుంది. రండి.. అంద‌రూ త‌ర‌లి రండి.. ద‌శావ‌తార శ్రీవారిని ద‌ర్శించుకుని పునీతులు కండి“- గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామి.