శ్రీదేవి బాల‌య్య‌తో అందుకే చేయ‌లేదా…

దివికేగిన దేవ‌క‌న్య శ్రీదేవి.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ… దాదాపు ఐదు భాషల్లో నటించింది. ఎందరో స్టార్ హీరోల సరసన నటించి ప్రశంసలు అందుకుంది. త‌మిళ సినిమాల నుంచి వెండితెర‌పై క‌నిపించిన శ్రీదేవిని తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌, ఇక్క‌డ అభిమానులే ఆమెను స్టార్ హీరోయిన్ చేశారు. తెలుగులో అయితే ఆమె దాదాపు మూడు తరాల నటులతో నటించి అలరించింది.తెలుగులో అయితే తండ్రి ఏఎన్నార్‌, కొడుకు నాగార్జున‌తో న‌టించిన అరుదైన ఘ‌న‌త శ్రీదేవి సొంతం. స‌హ‌జంగా త‌ల్లి, కూతుళ్ల ప‌క్క‌న హీరోయిన్లుగా చేసిన క్రెడిట్ హీరోల‌కు ఉంటుంది. హీరోల లైఫ్ పీరియడ్ ఎక్కువ కాబట్టి ఆ ఛాన్స్ ఉంటుంది. శ్రీదేవి విషయంలో ఇది రివర్స్ అయ్యింది. ఏఎన్నార్‌తో ఎన్నో ప్రేమ‌, కుటుంబ క‌థా చిత్రాల్లో న‌టించిన శ్రీదేవి ఆ త‌ర్వాత నాగార్జున‌తో ఆఖ‌రి పోరాటం సినిమాలో న‌టించింది.

నాగార్జునతో మొదట 1988లో ఆఖరి పోరాటం చిత్రంలో నటించిన శ్రీదేవి ఆ త‌ర్వాత 1994లో గోవిందా.. గోవిందా సినిమాలోనూ నటించారు. తెలుగులో ముందు త‌రం స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ లాంటి వాళ్ల‌తో న‌టించిన శ్రీదేవి ఆ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున‌తో కూడా న‌టించారు. అయితే ఈ త‌రం స్టార్ హీరోల్లో ఒక‌రు అయిన బాల‌కృష్ణ‌తో మాత్రం శ్రీదేవి జ‌ట్టు క‌ట్ట‌లేదు.

శ్రీదేవి – బాల‌కృష్ణ‌ కాంబినేషన్ లో ఓ సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరిగాయని చెబుతారు. కానీ ఎన్టీఆర్ జోక్యంతో ఆ సినిమా ఆగిపోయింద‌ని స‌మాచారం. అయితే మ‌రో టాక్ ప్ర‌కారం శ్రీదేవే బాల‌కృష్ణ‌తో చేసేందుకు ఇష్ట‌ప‌డ‌లేదంటారు. ఎన్టీఆర్‌కు మ‌న‌వ‌రాలిగాను, ప‌క్క‌న హీరోయిన్‌గా చేసిన ఆమె బాల‌య్య‌తో చేస్తే బాగుండ‌ద‌నే ఒప్పుకోలేద‌ని త‌న‌కు స‌న్నిహితులు అయిన ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల వ‌ద్ద అభ్యంత‌రం వ్య‌క్తం చేసింద‌ట‌.