టీడీపీకి బిగ్ షాక్ : వైసీపీ చేరిన మరో నేత

ఎన్నికలు సమీపిస్తున్నవేళ తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే కాకినాడ ఎంపీ, టీడీపీ కీలకనేత తోట నర్సింహం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా మరో ఎమ్మెల్యే అదే బాటలో నడవడానికి సిద్ధమయ్యారు. 2014 ఎన్నికల్లో వైసీపీ గుర్తుపై గెలిచిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు.. కొద్దిరోజులకే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తాజాగా మళ్లీ సొంతగూటికి రావడానికి సిద్ధమయ్యారు. ప్రత్తిపాడు టికెట్ తనకు ఇవ్వకుండా వరుపుల రాజాకు ఇవ్వడంతో ఆయన తీవ్ర మనస్తానికి గురయ్యారు. కాగా.. రెండేళ్ల కిందట వైసీపీ నుంచి టీడీపీలో సుబ్బారావు చేరారు.

ఒక్కడినే వైసీపీలో చేరుతా..!
దీంతో గురువారం మధ్యాహ్నం ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో పార్టీ మార్పు విషయమై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వరుపుల కంటతడిపెట్టేశారు. మళ్లీ వైసీపీ గూటికి వెళ్తానని సుబ్బారావు ప్రకటించేశారు. ఇందుకు స్పందించిన కార్యకర్తలు కూడా ఒప్పుకున్నారు. అయితే కొందరు కార్యకర్తలు మాత్రం వరపుల నిర్ణయాన్ని తప్పుబట్టి.. ఆయనపై తిరగబడ్డారు.

మీరు వైసీపీలోకి వెళ్లినా తామంతా టీడీపీలోనే ఉంటామంటూ కార్యకర్తలు తేల్చిచెప్పారు. దీంతో తాను ఒక్కడినే వైసీపీలోకి వెళ్తానంటూ వరుపుల సమావేశం నుంచి కోపంగా వెళ్లిపోయారు. కాగా.. ఆయన ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా.. సుబ్బారావు మనుమడు వరుపుల రాజాకు టికెట్‌ ఖరారుతో కావడంతో మనస్తాపం గురయ్యారు. అయితే ఇరువురు కలిసి ప్రత్తిపాడు టీడీపీ జెండా ఎగరేయాలని అధిష్టానం ఆదేశించింది. అయితే ఈ విషయమై సుబ్బారావు, రాజా మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి.