టీడీపీలో చేరిక్ తర్వాత మొదటిసారి బాబును కలిసిన గొట్టిపాటి

ఒంగోలు: జిల్లాను అమరావతి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అందుకు అవసర మైన చర్యలు ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్‌ బం గారంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదేసమయంలో కీలకమైన రాజకీయ వ్యవహారాలపైనా ఆరా తీశారు. ప్రధానంగా ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంపై దృష్టి సారించిన ఆయన కొండపి నేతలతో సూటిగా మాట్లాడి కొన్ని సూచన లు, హెచ్చరికలు చేశారు. చంద్రబాబు ఆలోచనను, ఆవేశా న్ని గమనించి కాబోలు వెనువెంటనే ఒంగోలు లోక్‌సభ రాజకీయ వ్యవహారాలపై పార్టీ నేతలు మాగుంట నివాసం లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఈనెల 12 నుంచి చేపట్టాల్సిన కార్యక్రమాలను కూడా నిర్ణయించు కున్నారు. మరోవైపు రామాయపట్నంలో జరిగిన జన్మభూమి సభ విజయవంతం కావడంతో ఎమ్మెల్యే పోతుల రామా రావును ముఖ్యమంత్రి అభినందించారు. అక్కడ హుషారు గా మాట్లాడారు. గత మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా అద్దంకి, పర్చూరు శాసనసభ్యులు కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి సాగర్‌ నీటి సమస్యను ప్రస్తావించారు. మ రోసారి నీరు ఇచ్చి తమ ప్రాంత రైతులను ఆదుకోవాలని వి జ్ఞప్తి చేశారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం పాదాభివందనం చేసి తన కృతజ్ఞత ను తెలియజేసుకున్నారు.

జన్మభూమి పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం పట్ల ఆయన మరింత ఉత్సాహాన్ని ప్రదర్శించారు. శాసనసభ్యుడు పోతుల రా మారావు సారథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా క లెక్టర్‌ వినయ్‌చంద్‌ సంక్రాంతి పర్వదినం ఉట్టిపడే రీతిలో అ క్కడ కొన్ని ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. కొద్ది మాసాల క్రితం కందుకూరులో నిర్వహించిన బహిరంగ సభను కూడా శాసనసభ్యుడు పోతుల రామారావు దిగ్విజ యం చేసి ముఖ్యమంత్రి మన్ననలు పొందారు. అదేతరహా లో రామాయపట్నం సభ కూడా విజయవంతమైంది. సభ కు తరలి వచ్చిన జనాన్ని చూసిన తర్వాత విమర్శకులు సైతం సైలెంట్‌ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ముఖ్య మంత్రి చంద్రబాబు కూడా పోతుల రామారావును అభినందించి భుజం తట్టారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్తంత అవకాశం దొరికిన సమయంలో జిల్లాలో పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించి సమీక్ష చేశారు. ప్రధానంగా కొండపి అసెంబ్లీ నియోజక వర్గంలో పార్టీ వ్యవహాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తొలుత ఎమ్మెల్యే స్వామి, యువనాయకుడు సత్య వద్ద ప్ర స్తావించిన ఆయన అనంతరం ఆ నియోజకవర్గానికి చెంది న కందుకూరు, ఒంగోలు శాసనసభ్యులు పోతుల రామా రావు, దామచర్ల జనార్దన్‌ను పిలిపించుకొని కొండపిపై సమీక్షించారు. మధ్యాహ్న సమయంలో బస్సులో ఆయన్ను ఎమ్మెల్యే స్వామి, దామచర్ల సత్య కలిసి ఒకరికి సీఎం సహా య నిధి రుణాన్ని మంజూరు చేయాలని కోరారు. ఓకే అన్న ఆయన ‘ఇంతకీ కొండపి ఎలా ఉంది? అంతా సెట్‌ అయిందా. మీరేం జాగ్రత్తలు తీసుకున్నారు’? అని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన స్వామి, సత్య అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, ముఖ్య నాయకులతో సమావేశం కావడంతోపాటు సంగమేశ్వరంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించామని వారు చెప్పినట్లు తెలిసింది.

దీనిపై స్పందించిన చంద్రబాబు ‘ఇక్కడ మనకు కావాల్సింది బహిరంగ సభలు కాదు. అవసరమైన వ్యక్తుల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం కావాలి. మనస్పర్థలు పోవాలి. ఆ రకమైన సమీక్షలు జరగాలి. తద్వారా మరింత ఫలితం సాదించాలి. అలా ముందుకు నడవండి’ అని సూచించినట్లు తెలిసింది. మేమే గొప్ప అన్న వైఖరిలో ఎవరైనా ఉంటే విడనాడండి అని కూడా సూచించినట్లు తెలిసింది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంగోలు ఎమ్మెల్యే జానార్దన్‌, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావును అక్కడికి పిలిపించుకున్నారు. పరిస్థితి ఏమిటి? అని వారిని ప్రశ్నించారు. వెంటనే దామచర్ల జోక్యం చేసుకొని కొన్ని చోట్ల మండల స్థాయి, మరికొన్ని చోట్ల గ్రామస్థాయిలో కొందరు నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాల్సి ఉందని, ఆదిశగా అడుగు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి నట్లు తెలిసింది. పోతుల మాట్లాడుతూ ఓసారి తన వద్దకు వచ్చి ఆత్మీయ సమ్మేళనానికి రావాలని కోరారని, ఆ తర్వాత ఓ మిత్రుడి ద్వారా కలిసి మాట్లాడుకుందామని సమాచారం పంపగా తాను ఓకే చెప్పానన్నారు. కానీ, ఆవిధంగా కాకుండా మరొకరితో కలిసి వచ్చారని చెప్పినట్లు తెలిసింది. తాను ఒక ప్రతిపాదన చేయగా ఆలోచించి చెప్తామన్న వారు తిరిగి తన వద్దకు రాలేదని తెలియజేసినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి ‘ఏది ఏమైనా ఒంగోలు లోక్‌సభ పరిధిలో కొండపి కీలకమైన నియోజకవర్గం. మీరందరూ కలిసి పని చేస్తే కనీసం 40వేల ఓట్ల ఆధిక్యం వస్తుంది. నేను సేకరించుకున్న సమాచారానికి అనుగుణంగానే ఈ మాట చెప్తున్నా. మీరంతా కలిసి పని చేసి దాన్ని సాధించాల్సిందే. అందుకు అవసరమైన చర్యలు తీసుకోండి’ అని అందరికీ సూటిగా చెప్పినట్లు తెలిసింది.

ముఖ్యమంత్రి జిల్లా నుంచి వెళ్లిన రెండు గంటలకే పార్టీలోని కొందరు ముఖ్య నాయకులు శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావుతోపాటు మాగుంట, కరణం బలరాం, దామచర్ల జనార్దన్‌, ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు దివి శివరాం పాల్గొన్నారు. సుమారు రెండు గంటలపాటు వారి మధ్య ప్రధానంగా ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అ సెంబ్లీ సెగ్మెంట్‌లలో పరిస్థితులపై చర్చించుకున్నారు. ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి తదితర నియోజక వర్గాలపై ప్రత్యేకంగా వారు సమీక్షించుకున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మాగుంట గెలుపే ధ్యేయంగా చేపట్టాల్సిన చర్యలపై తాత్కాలికంగా ఒక నివేదిక రూపొందించుకున్నారు. అందుకు అనుగుణం గా ఈనెల 12 నుంచి ముఖ్యనేతలంతా కలిసి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే రామాయపట్నంలో ముఖ్యమంత్రి వీరికి ప్రత్యేకంగా ఏమైనా హెచ్చరికలు చేశారా? లేక కొండపి సమీక్ష రూపంలో ఇచ్చిన సూచనతో వీరు వెంటనే భేటీ అయ్యారా? అన్నది తెలియరా లేదు.

పక్కపక్క నియోజకవర్గాలైన అద్దంకి, పర్చూరు శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు తొలిసారి ఒక ప్రజా సమస్యపై కలిసి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం విశేషం. ఎమ్మెల్యే రవికుమార్‌ టీడీపీలో చేరిన తర్వాత నుంచి కూడా వివిధ కారణాల వలన ఈ ఇద్దరు కలిసిన దాఖలాలు లేవు. అదేసమయంలో ఒకరినొకరు వ్యతిరేకించుకోవడం, విభేదించుకోవడం కానీ జరగలేదు. గత కొంతకాలం నుంచి ఎక్కడ వారు తటస్థ పడినా రవికుమార్‌ను ముందుగా ఏలూరి పలుకరించడం జరుగుతోంది. మరోవైపు రవికుమార్‌ కూడా తన స్వగ్రామ మైన యద్దనపూడి వారు కానీ, పర్చూరు నియోజకవర్గం లోని తన అనుచరులు కానీ కలిసినప్పుడు ‘నేను ఇప్పుడు టీడీపీలో ఉన్నా. నియోజకవర్గం వేరైనా మీరు టీడీపేకే చేయాలి’ అని చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బుధ వారం సీఎం చంద్రబాబు రామాయపట్నంలో కార్యక్రమాల అనంతరం తిరిగి అమరావతికి వెళ్లే సమయంలో హెలిప్యా డ్‌ వద్ద వారిద్దరూ కలిసి రెండు నియోజకవర్గాలకూ సమస్యగా మారిన సాగునీటి విషయాన్ని ప్రస్తావించారు. మరోసారి సాగర్‌ నీరు విడుదల చేయించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘నీటి సమస్య ఎలా ఉందో మీకూ తెలుసు. ఏమాత్రం అవకాశం ఉన్నా నీరిచ్చి రైతులను ఆదుకుందాం’ అని చెప్పారు. ఆ ఇద్దరూ కలిసి రావడం చూసి చిరునవ్వుతో బుజాలపై చేతులు వేసి అభినందించారు.