టీడీపీ గెలుపు చారిత్రక అవసరం

‘‘నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఎంతో చేశాం. ఇప్పటిదాకా జరిగినదాన్ని మించి అభివృద్ధి జరగాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీనే గెలిపించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను కోరారు. టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని వ్యాఖ్యా నించారు. ‘‘నాడు వోక్స్‌వ్యాగన్‌, ప్రోటాన్‌ రెండు కార్ల కంపెనీలు వస్తాయనుకున్నాం. నేనూ మాట్లాడాను. కానీ తర్వాతి ప్రభుత్వాల అవినీతికి వోక్స్‌వ్యాగన్‌ బలైపోయింది. పుణె వెళ్లిపోయింది. అది చూసి పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడానికి భయపడ్డారు. ‘అది కాదు..ఇప్పుడు నేనున్నాను’ అని వారికి భరోసా ఇచ్చాను. ‘మీరు బాగానే చేస్తారు. కానీ మళ్లీ తర్వాత ఏంటి?’ అని వారు అడిగారు. బయట ఉండేవారికి స్వల్ప అనుమానం. మనం ఇక్కడున్నాం. మనకేం అనుమానం లేదు. కచ్చితంగా గెలుస్తాం. రాయలసీమకు ఏం జరిగింది. మీడియా అంతా రాస్తూనే ఉంది. ఇక్కడ ఏమీలేవని? కానీ ఏమొచ్చాయి. ఒక ప్రాజెక్టుకు ఒప్పించడం ఎంత ముఖ్యమో దాన్ని అమలుచేయడం ఇంకా ముఖ్యం. అది కియతో చేశాం. ఈ ఆశను ఇంకా ముందుకుతీసుకెళ్తాం. ఇంకా చాలా పెట్టుబడులు రావాలి. ఇది ప్రారంభం మాత్రమే. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అన్నిసీట్లు గెలిస్తే మొత్తం ప్రపంచ పెట్టుబడులన్నీ ఇక్కడికే వస్తాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కియ ప్లాంట్‌లో ట్రయల్‌ రన్‌ ప్రారంభించి..తొలి మోడల్‌ వాహనం ఎస్‌పీ2ఐను టెస్ట్‌ డ్రైవ్‌ చేశాక చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. కియ వాహనాలు కొనాలని పిలుపునిస్తున్నానని, ఇది రాష్ట్రంలో తయారైన వాహనం, మనకు గర్వకారణమని పేర్కొన్నారు. అనంతపురానికి ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు. ఇక్కడుండే యువతకు శిక్షణ ఇస్తామని, కియలో ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. కియకు 374 మంది రైతులు భూములిచ్చారని, వారిలో కొందరికి ఉద్యోగాలు వచ్చాయని, మిగతా వారికి కూడా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కియలో ట్రయల్‌ రన్‌ ఒక చారిత్రక దినం. గుర్తుంచుకోదగ్గ అంశం. ఎందుకంటున్నానంటే…అనంతపురం జిల్లా ఆశ వదులుకున్న జిల్లా. భవిష్యత్తులేదని ఎన్నో ఏళ్లుగా విమర్శలు చేయడం తప్ప ఎవరూ సరిచేయలేదు. నీరు-ప్రగతి ప్రారంభించినప్పుడు ఒకటే చెప్పా. నీళ్లుంటే ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేశాను. నీళ్లుంటే బంగారు భవిష్యత్తు. అందుకే మొట్టమొదటి ప్రాధాన్యత సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చా. ఒకపక్క భూగర్భ జలం పెంచడం, మరోపక్క నదుల అనుసంధానం, పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి.. ఇలా ఒక్కో కార్యక్రమం చేపట్టాను. ఈ ప్రాంతంలో ఇంత అద్భుత ప్లాంటు ఎవరూ కలగనలేదు. జిల్లావాసులకు ఉత్సవ దినం ఇది. రాబోయే రోజుల్లో అన్నీ మంచి శకునాలే. బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది’’ అని పేర్కొన్నారు.
అధికారులకు అభినందనలు…: కియ ప్లాంటు రావడానికి సహకరించిన అధికారులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. సీఎంవో ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, ప్రభుత్వ సలహాదారు ప్రీతమ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, ఏపీఐఐసీ ఎండీ అహ్మద్‌బాబు అంతా కలిసి కష్టపడ్డారని కితాబిచ్చారు. జిల్లాకలెక్టర్‌ శశిధర్‌, వీరపాండ్యన్‌ బాగా చేశారన్నారు. ఈ శుభ సందర్భంలో ఇంతకంటే మాట్లాడలేను. ఉప్పొంగే ఆనందం. కలలో కూడా ఊహించలేదు’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు కూడా త్వరలోనే తయారుచేసే రోజు వస్తుందన్నారు. అనంతరం అందరితో ఫొటోలు దిగారు.

‘‘ప్రపంచంలో కియ అంటే సర్‌ప్రైజ్‌. మాటకంటే ముందే పనిచేసి సర్‌ప్రైజ్‌ ఇవ్వడం ఆ కంపెనీకి అలవాటు. వాళ్లకార్ల నాణ్యత, డిజైన్‌లు అన్నీ సర్‌ప్రైజ్‌గానే ఉంటాయి. అయితే ఒకటే చెప్తున్నా. కియ ఒక సర్‌ప్రైజ్‌ ఇస్తే…నేను మూడు సర్‌ప్రైజ్‌లు ఇస్తా. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్నివిధాలుగా ముందుంటా’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.