టీడీపీ సీనియర్ నేతకు ఎదురెళ్లి.. కండువా కప్పిన జగన్!

కర్నూలు జిల్లాకు చెందిన నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత లబ్బి వెంకటస్వామి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం మద్యాహ్నం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. లబ్బి లోటస్‌పాండ్‌కు వచ్చినట్లు తెలుసుకున్న జగన్.. స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు.! అనంతరం కాసేపు తాజా రాజకీయ పరిణామాలను చర్చించన జగన్.. వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

చేరిక అనంతరం లబ్బి మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. జగన్‌తోనే ప్రత్యేక హోదా వస్తుందని భావిస్తున్నామన్నారు. పార్టీలో చేరిన తనకు జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని లబ్బి స్పష్టం చేశారు. కాగా 2009 ఎన్నికల్లో లబ్బి కాంగ్రెస్ తరఫున నందికొట్కూర్ నుంచి పోటీ చేసి 5,773 మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం సైకిలెక్కిన ఆయన.. తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా లబ్బి వైసీపీలో చేరిక వెనుక యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు సమాచారం.

కాగా.. లబ్బి పార్టీలో చేరికకు ముందు లోటస్‌పాండ్‌లో జగన్‌తో పార్టీ ముఖ్యనేతల భేటీ అయ్యారు. ఈ భేటీలో విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి, శిల్పామోహన్‌రెడ్డి, రామకృష్ణ, బైరెడ్డి సిద్దార్ధరెడ్డితో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం లబ్బి, గురురాఘవేంద్ర సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డికి జగన్ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు.