కడప జిల్లాలో టీడీపీ రాజకీయ పధకం ఫలించనుందా..

కడప జిల్లాలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ప్రభుత్వ విప్‌ రామసుబ్బారెడ్డి మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని వారిద్దరూ అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఆదినారాయణరెడ్డి ప్రస్తుతం జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఆయన.. టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. పోయిన ఎన్నికల్లో ఆయనపై పోటీచేసి ఓడిపోయిన టీడీపీ సీనియర్‌ నేత పి.రామసుబ్బారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా, మండలిలో విప్‌గా ఉన్నారు. కడప జిల్లాలో రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ ఇద్దరిలో ఒకరిని ఎమ్మెల్యేగా.. మరొకరిని కడప ఎంపీగా నిలపాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. దీనిపై గత మూడు నాలుగు రోజులుగా వారిద్దరు, వారి కుటుంబ సభ్యులు, అనుచర గణం అభిప్రాయాలను తెలుసుకుంటోంది. ఇద్దరికీ ఎమ్మెల్యే సీటు పైనే ఆసక్తి ఉంది. తాను సిటింగ్‌ ఎమ్మెల్యేను కాబట్టి రామసుబ్బారెడ్డి ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని ఆది కోరుతున్నారు.

జిల్లావ్యాప్తంగా మంచి పరిచయాలు ఉన్న మంత్రి ఎంపీ స్థానానికి మంచి అభ్యర్థి అవుతారని, తననే ఎమ్మెల్యేగా నిలపాలని రామసుబ్బారెడ్డి కోరుతున్నారు. పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో వారిద్దరూ ఇక్కడ ముఖాముఖి మాట్లాడుకున్నారు. లాభనష్టాలు బేరీజు వేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి మంగళవారం సీఎంను కలిశారు. ‘మా ఇద్దరిలో ఎవరు ఎక్కడ నిలబడితే బాగుంటుందో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే. దానికి కట్టుబడి ఉంటాం’ అని వారిద్దరూ ఆయనతో చెప్పినట్లు సమాచారం.