టీడీపీ తెలంగాణ ఓటు బ్యాంకు ఎటు వైపో

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి అన్ని పార్టీల అభ్యర్థులకు కీలకంగా మారింది. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తెలుగుదేశం పార్టీకి సుమారు లక్ష ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ ఓటు బ్యాంక్‌ ఎటువైపు మొగ్గుచూపుతుందో అన్న విషయం ఆసక్తిగా మారింది. గెలుపు విషయంలో వీరి ఓట్లు కీలకం కావడంతో వారిపై టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రత్యేక దృష్టిసారించాయి. టీఆర్‌ఎస్‌ డివిజన్‌ స్థాయి అభ్యర్థులపై గురిపెట్టగా, కాంగ్రెస్‌ సైతం చాపకింద నీరులా తన ప్రయత్నాలు చేస్తోంది. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థికి లక్ష మెజారిటీ తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే గాంధీ స్థానిక నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిట్టింగ్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో దిగారు. ఆయనకు నియోజకవర్గంలో అన్ని పార్టీల నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ ఈ ఎన్నికల్లో చురుకుగా వ్యవహరించడం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీ అభ్యర్థి మంచి మెజారిటీతో విజయం సాధించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.