టీడీపీలోకి కాంగ్రెస్ నేత.. బుద్దా వెంకన్న స్పందన..

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారన్నదానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కిశోర్ చంద్రదేవ్ మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబును కలిశారని అన్నారు. ముఖ్యమంత్రి కూడా సంతోషం వ్యక్తం చేశారన్నారు. కిశోర్ చంద్రదేవ్ మంచి నాయకుడని బుద్దా వెంకన్న కొనియాడారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని, ప్రజల్లోకి వెళ్లాయని, ప్రజలు కూడా టీడీపీవైపే ఉన్నారని సీఎంను కిశోర్ చంద్రదేవ్ ప్రశంసించారు. ఏది ఏమైనా కిశోర్ చంద్రదేవ్ లాంటి వాళ్లు టీడీపీలోకి రావడం సంతోషించదగ్గ విషయమని బుద్దా వెంకన్న అన్నారు. నైతిక విలువలు ఉన్న నాయకుడు టీడీపీలోకి రావడం శుభపరిణామమని అన్నారు.