టీడీపీలోకి కిశోర్ చంద్రదేవ్?

కేంద్రమాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ మంగళవారం ఢిల్లీలో చంద్రబాబును కలిశారు. ఇటీవల కాంగ్రెస్‌కు ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన టీడీపీలో చేరుతున్నారు. అయితే ఎప్సుడు పార్టీలో చేరతారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. వారం పది రోజుల్లో టీడీపీలో చేరనున్నట్లు కిశోర్ చంద్రదేవ్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తాను పార్టీలోకి వస్తానంటే చంద్రబాబు అంగీకరించారని చెప్పారు. అమరావతిలో తాను టీడీపీలో చేరతానని అన్నారు. తాను కాంగ్రెస్‌ను వీడడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పార్టీ కూడా బలహీనమైందన్నారు. దేశంలో మోదీని ఓడించడానికి తాను ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రస్తుతం మోదీపై చంద్రబాబు పోరాటం చేస్తున్నారని, ఆ పార్టీలో చేరితే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. అందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిశోర్ చంద్రదేవ్ చెప్పారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశిస్తే అక్కడినుంచే పోటీ చేస్తానని అన్నారు. ఎలాంటి షరతులు లేకుండానే తాను టీడీపీలో చేరుతున్నానని కిశోర్ చంద్రదేవ్ స్పష్టం చేశారు.