ధర్మపోరాట దీక్షలో తెలుగు తల్లి పాత్రధారి ఎవరంటే..

నవ్యాంధ్రకు మోదీ ప్రభుత్వం చేసిన అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో ధర్మపోరాట చేస్తున్నారు. ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ భవన్‌ వేదికగా సమర శంఖం పూరించారు. ఈ దీక్షలో తెలుగు తల్లి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘నా తల్లి భరత మాత సాక్షిగా నా రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న కేంద్రం’ అనే స్లోగన్ ఉన్న ప్లకార్డును పట్టుకుని వేదికపై తెలుగు తల్లి పాత్రధారి నిరసన తెలుపుతున్నారు. ఆ పాత్రధారి ఎవరో కాదు.. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ. తెలుగు తల్లిని ప్రతిబింబించేలా ఉన్న యామినిని పలువురు టీడీపీ నేతలు ప్రశంసించారు.

సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఢిల్లీ చేరుకున్నారు. శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు ప్రత్యేక రైళ్ల ద్వారా దాదాపు రెండు వేల మంది కార్యకర్తలు తరలివెళ్లారు. దీంతో ఏపీ భవన్ మొత్తం నిండి పోవడంతో కొందరు కేరళ హౌస్‌కు వెళ్లారు. సాధినేని యామిని శర్మ కూడా కేరళ హౌస్ నుంచి తెలుగుతల్లి గెటప్‌తో ఏపీ భవన్‌కు వచ్చారు. ఏపీ భవన్‌ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దీక్ష జరగనుంది.