ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తుల్లేవ్?

తెలంగాణలో కలిసి పోటీ చేసినా.. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నా.. రాష్ట్రంలో మాత్రం టీడీపీ, కాంగ్రెస్‌ వేర్వేరుగానే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల స్వరంలో వస్తున్న మార్పే ఇందు కు కారణం! అయితే, పొత్తులపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం 29 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇతర రాష్ర్టాల పరిస్థితి ఎలా ఉన్నా… ఆంధ్రలో పరిస్థితి భిన్నంగా ఉందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్‌ పార్టీవల్లే జరిగిందని ప్రజలు ఆగ్రహించడంతో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే.. ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారని ప్రజలు ఇప్పుడు కోపంతో ఉన్నారని, కాంగ్రెస్‌ పార్టీపై 2014లో ఉన్నంత వ్యతిరేకత, ఆగ్రహం తగ్గి… ఇప్పుడు ఆదరణ పెరుగుతోందని అంటున్నారు. అయితే ఈ పెరిగిన ఆదరణ ఓటు బ్యాంకుగా మారుతుందో లేదో అన్న తర్జనభర్జన కాంగ్రెస్‌లో ఉంది.
బీజేపీకి వ్యతిరేక కూటమిని కట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ రాహుల్‌గాంధీతో పలు దఫాలు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయానికీ వచ్చినట్లు వార్తలొచ్చాయి. అయితే.. తెలంగాణలో మహాకూటమిగా ఏర్పడి టీఆర్‌ఎ్‌సపై పోటీ చేసిన వ్యూహం వికటించిందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. రాష్ట్ర నేతల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో… తెలంగాణ ఎన్నికలకు ముందు ఏపీలో నిర్వహించిన సర్వే నివేదికతో పాటు, తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత మరో దఫా టీడీపీతో పొత్తుపై నేతల అభిప్రాయాలను పీసీసీ సేకరించింది. మొదటిసారి సేకరించిన అభిప్రాయ సేకరణలోనే పొత్తులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రెండోసారి చేసిన అభిప్రాయ సేకరణలో అత్యధికులు టీడీపీతో పొత్తు వద్దని అన్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇదే విషయాన్ని రాహుల్‌ గాంధీకి వివరించారు. దీంతో, రాష్ట్రంలో టీడీపీతో పొత్తుపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 20లోగా ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశముందని అంటున్నారు. అయితే, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలున్నాయని ముఖ్యనేతలు చెబుతున్నారు.