తిరుగులేని బ్రాండ్‌ ఇమేజ్‌… పలాస మళ్ళీ ‘ గౌతు ‘ దే

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మరో సారి చరిత్ర పున‌రావృతం కానుంది. పలాస నియోజకవర్గం పేరు చెబితే సర్దార్‌ గౌతు లచ్చన్న ఫ్యామిలీనే ముందుగా గుర్తుకువస్తుంది. ఆరేడు దశాబ్దాల చరిత్రలో గౌతు లచ్చన్న పలాస నుంచి చట్ట సభలకు ఎంపికై రాష్ట్ర, దేశ వ్యాప్తంగానే పేరెన్నికగన్నారు. గతంలో రద్దు అయిన సోంపేట నుంచి గౌతు లచ్చన్న ఐదు సార్లు గెలిస్తే ఆయన కుమారుడు శివాజి మరో ఐదు సార్లు గెలుపొందడం ద్వారా మొత్తం పది సార్లు సోంపేట నుంచి వీరిద్దరే ప్రాధినిత్యం వహించారు. శివాజీ ఒక సారి ఇండిపెండెంట్‌గా, నాలుగు సార్లు టీడీపీ తరపున గెలిచారు. లచ్చన్న గతంలో ప్రకాశం పంతులు కేబినెట్‌లో కూడా పని చేశారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేసిన ఘనత కూడా ఆయనకు దక్కింది. ఈయన మరో అరుదైన రికార్డు కూడా సాధించారు. 1967లో ఈయన లోక్‌సభ, శాసనసభకు ఎన్నికై పోటీ చేసి రెండు చోట్ల గెలిచి లోక్‌సభ సీటును వదులుకున్నారు. ఆ సీటును అదే సమయంలో తన రాజకీయ గురువుగా భావించే ఆచార్య ఎన్జీ. రంగ గుంటూరులో లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో తాను గెలిచిన శ్రీకాకుళం లోక్‌సభ సీటుకు ఆయన రాజీనామా చేసి ఎన్జీ. రంగాను శ్రీకాకుళం నుంచి పోటీ చేయించి గెలిపించిన ఘనత లచ్చన్నకే దక్కుతుంది. ప్ర‌పంచ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఎవ‌రూ ఇలాంటి సాహ‌సం చేయ‌లేదు

లచ్చన్న వారసుడిగా శివాజి తిరుగులేని ప్రస్థానం..!
ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన సర్దార్‌ గౌతు లచ్చన్న వారసుడుగా పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన శివాజి రద్దు అయిన సోంపేట నుంచి ఐదు సార్లు గెలిస్తే కొత్తగా ఏర్పడిన పలాస నుంచి మరో సారి గెలిచి మొత్తంగా ఆరో సారి గెలుపొందారు. 2009లో మాత్రమే స్వల్ప తేడాతో ఆయన ఓడిపోయారు. శ్రీకాకుళం జిల్లాలోనే అత్యధిక సార్లు గెలిచిన ఘనత శివాజీకి దక్కింది. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన విశేషమైన సేవలు అందించారు. తండ్రి లచ్చన్న ఐదు సార్లు శాసనసభకు ఎన్నిక అవ్వడంతో పాటు ఒకే సారి శాసనసభకు, లోక్‌సభకు ఎన్నిక అవ్వడం, తన రాజకీయ గురువు కోసం తన లోక్‌సభ సీటును వదులుకుని ఆయన్ను తన స్థానంలో పోటీ చేయించి గెలిపించడం లాంటి రికార్డులు సాధిస్తే శివాజీ సైతం జిల్లాలో ఎవరికి లేనట్టుగా ఆరు సార్లు శాసనసభకు ఎన్నిక అయిన ఘనత దక్కించుకోవడంతో పాటు 1985లో టీడీపీ సీటు దక్కని పక్షంలో ఇండీపెండెంట్‌గా పోటీ చేసి ఘన విజయం సాధించారు. నాడు రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కాంగ్రెస్‌ గాలులను ఎదుర్కొని శివాజి ఇండీపెండెంట్‌గా గెలవడం అంటే మామూలు విషయం కాదు.

అలాగే 2004లో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్‌ గాలులు బలంగా వీచాయి. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి భారీ మెజారిటీతో సీఎం అయ్యారు. ఆ సమయంలోనూ ఆయన సోంపేట నుంచి ఘన విజయం సాధించారు. 2004లో శివాజి కాంగ్రెస్‌ అభ్యర్థి జుత్తు జగన్నాయకులుపై ఏకంగా 11,000 ఓట్ల తేడాతో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. రద్దు అయిన సోంపేట, పలాస నియోజకవర్గాల్లో తిరుగులేని రాజకీయ చరిత్ర ఉన్న గౌతు ఫ్యామిలీకి మరో రికార్డు కూడా ఉంది. కుల రాజకీయాలకు పెట్టిందైన ఆంధ్రాలో వీరు కులాల‌తో సంబంధం లేకుండా వ‌రుస విజ‌యాలు సాధించారు. ప‌లాస‌లో గౌతు ఫ్యామిలీ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల మనసులను ఏకంగా ఆరేడు దశాబ్దాలుగా గెలుచుకుంటూ రావడం అంటే గౌతు బ్రాండ్‌ ఎలా ఉందో తెలుస్తోంది.

తాత, తండ్రి బాటలోనే గౌతు వారసురాలు ఎంట్రీ..!
ఏడు దశాబ్దాలు మూడు తరాలు ఎలాంటి మచ్చాలేని గౌతు ఫ్యామిలీ నుంచి మూడోతరం వారసురాలుగా గౌతు లచ్చన్న మనవరాలు, గౌతు శివాజీ కుమార్తె గౌతు శిరీష పొలిటికల్‌ ఎంట్రీ సైతం సక్సెస్‌ఫుల్‌గానే జరిగింది. అతి చిన్న వయస్సులోనే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన శిరీష శ్రీకాకుళం జిల్లా పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్లు, తలపండిన నాయకులు అయిన మంత్రులు అచ్చన్నాయుడ, మంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు, విప్ కూన రవికుమార్‌, సీనియర్‌, తన తండ్రి గౌతు శివాజితో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుంటూ ఓ మహిళగా ముందుకు వెళ్తున్న తీరుకు ఆమెకు రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. కమ్యూనిటీ పరంగా, మహిళా కోణంలో తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్‌లో శిరీష మంచి నాయకురాలు అవుతుందన్న అంచనా కూడా ఉంది. జిల్లా పార్టీ నాయకురాలుగా సక్సెస్‌ అవ్వడంతో పాటు తాజాగా రాజమండ్రిలో జరిగిన పార్టీ బీసీ గర్జన విజయవంతంలోనూ ఆమె తన వంతు పాత్ర పోషించి పార్టీ అధిష్టానం ప్రశంసలు అందుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు డెసిషన్‌ బట్టీ పలాస బరిలో పోటీకి దిగడం ఖాయంగానే కనిపిస్తోంది. పార్టీకి భవిష్యత్తులో బీసీల్లో మహిళగా తిరుగులేని నేతగా శిరీష ఉంటుందన్న ఆశతో అధిష్టానం సైతం ఉంది. ఇటు శిరీష సైతం భవిష్యత్తు రాజకీయ యువనికపై తన వంతు పాత్ర అన్ని కోణాల్లోనూ పోషించేందుకు సిద్ధంగానే ఉన్నారు. అతి తక్కువ టైమ్‌లోనే ఆమె ఎంతో పరిణితి కలిగిన మహిళా నేతగా గుర్తింపు పొందారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో శిరీష ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీపై శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. శిరీష పోటీయే ఆల‌స్యం ప‌లాస‌లో మ‌ళ్లీ గౌతు ఖాతాలోనే చేర‌నుంది.