ఉంగుటూరులో అరుదైన రికార్డుకు చేరువ‌లో గ‌న్ని… ఆ సెంటిమెంట్ రిపీటే…!

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. అధికార టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మరో సారి పోటీకి రెడీ అవుతున్నారు. సెంటిమెంట్లకు చిరునామాగా మారిన ఉంగుటూరు రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లోనూ ఆ సెంటిమెంట్‌ను గన్ని రిపీట్‌ చేస్తారన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నియోజకవర్గం ఏర్పడిన 1967 నుంచి 2014 ఎన్నికల వరకు ఇదే సెంటిమెంట్‌ కంటిన్యూ అయ్యింది. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో సైతం ఇక్కడ నుంచి గన్ని గెలుపొందగా ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అలాగే ఉంగుటూరు నియోజకవర్గంలో మరో సెంటిమెంట్‌ కూడా కంటిన్యూ అవుతూ వస్తోంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన దివంగ‌త నేత చింతలపాటి వరప్రసాద్‌ మూర్తిరాజు వరుస విజయాలు సాధించారు.

1967, 1972లో ఇక్కడ ఆయన వరుసగా రెండు సార్లు గెలిచారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక జరిగిన 1983, 1985 ఎన్నికల్లో కంఠమని శ్రీనివాసరావు వరుస విజయాలు సాధించారు. 1994, 1999లో కొండ్రెడ్డి విశ్వనాధం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వ‌రుస‌గా రెండు సార్లు గెలిచారు. ఇక 2004, 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ మంత్రి వట్టి వసంత్‌ కుమార్‌ రెండు సార్లు గెలిచారు. ఇలా ఉంగుటూరు నియోజకవర్గంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు ఇక్కడ గత కొద్ది సంవత్సరాలుగా పోటీ చేసే వారు రెండు సార్లు వరుసగా గెలుస్తు వస్తున్నారు. మూర్తి రాజు, కంఠమని శ్రీనివాసరావు కొండ్రెడ్డి విశ్వనాధం, వట్టి వసంత్‌ కుమార్‌ అలాగే వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం గన్ని వీరాంజనేయులు సైతం నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి వీరి సరసన చేరే అరుదైన రికార్డుకు చేరువ‌లో ఉన్నట్టే ఉంగుటూరు పొలిటిక‌ల్ ట్రెండ్ చెపుతోంది.

ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణాన్ని బట్టీ చూస్తే అధికార తెలుగుదేశం పార్టీ మరో సారి అధికారంలోకి వ‌స్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఇదే క్రమంలో ఉంగుటూరు నియోజకవర్గంలో సైతం సిట్టింగ్‌ ఎమ్మెల్యే గెలుపు విషయంలో ఎలాంటి డోకా లేదు. నాలుగున్న‌రేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గాన్ని కోట్లాది రూపాయ‌ల‌తో అభివృద్ధి చేశారు. పార్టీల‌తో సంబంధం లేకుండా ఆయ‌న అంద‌రిని క‌లుపుకుపోతూ వ్య‌క్తిగ‌తంగా కూడా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఉంగుటూరులో మ‌రోసారి గ‌న్నికి గెలుపు ఛాన్స్‌లు పుష్క‌లంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే పై రెండు సెంటిమెంట్లు ఇక్క‌డ బ్రేక్ అవ్వ‌నున్నాయి.