ఉంగుటూరు బీసీ ఓట్లు అన్నీ ‘ గ‌న్ని ‘ కే … !

ప‌నిచేసే నాయ‌కుడు ఉంటే ప్ర‌జ‌లు ఆయ‌న వెంటే! అనే సూత్రాన్ని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉంగుటూరు నియోజ‌క వ‌ర్గం ప్ర‌జ‌లు నిరూపిస్తున్నారు. ఇక్క‌డ సామాజిక వ‌ర్గాల‌కు అతీతంగా ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులుకే మ‌రోసారి ప‌ట్టం క‌ట్టేందుకు రెడీ అయ్యారు. వాస్త‌వానికి గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల‌లో ఉంగుటూరులో జ‌రిగిన అభివృద్ధి అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున నిధులు స‌మీక‌రించి ఇక్క‌డి ప్ర‌తి మండ‌లాన్ని, గ్రామాన్నీ కూడా అభివృద్ధి బాట‌లో దూసుకుపోయేలా చేశారు ఎమ్మెల్యే గ‌న్ని. అంతేకాదు, తాను ఏం చేసినా.. పార‌దర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేశారు. నాలుగున్న‌రేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గంలో ఏ చిన్న విమ‌ర్శ‌కు కూడా ఆయ‌న ప‌ని చేశారంటే గ‌న్ని పాల‌న ఎలా సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం లేకుండా పార్టీని ముందుకు న‌డిపించారు.

ఈ క్ర‌మంలో ఉంగుటూరులో పార్టీల‌కు అతీతంగా ప్ర‌జలు మ‌ళ్లీ గ‌న్నినే కోరుకుంటున్నారు. పార్టీల‌తో సంబంధం లేకుండా ఆయ‌న‌కు అనుకూలంగా రాజ‌కీయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నా రు. తాజాగా టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ఇక్క‌డ బీసీ స‌ద‌స్సును నిర్వ‌హించారు. ఇక్క‌డ బీసీ సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువ‌. ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ వీరి హ‌వా మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అదేవిధంగా ఇక్క‌డ బీసీల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌తి పార్టీ, ప్ర‌తి నాయ‌కుడు కూడా ఉత్సాహంగా ముందుకు వ‌స్తారు. అయితే, ఇక్క‌డ గ‌న్ని చేసిన అభివృద్ధికితోడు బీసీ సామాజిక వ‌ర్గానికి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌తి ప‌ధ‌కాల‌న్నీ తు.చ‌. త‌ప్ప‌కుండా ఇక్క‌డ అమ‌లు చేస్తూ.. గ‌న్ని మ‌రింత గుర్తింపు పొందారు. దీంతో ఇక్క‌డ బీసీ వ‌ర్గం మొత్తం ఆయ‌న‌కే జై కొడుతోంది. ఈ విష‌యం తాజాగా మ‌రోసారి నిరూపిత‌మైంది.

ఉంగుటూరు నియోజకవర్గంలోని ఉంగుటూరు మండ‌లం కైకరంలో తాజాగా జరిగిన నియోజకవర్గస్థాయి జ‌య‌హో బీసీ స‌ద‌స్సు అఖండ విజ‌యం సాధించింది. బీసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కులు, వివిధ సామాజ‌క వ‌ర్గాల వారు పెద్ద ఎత్తున హాజ‌రై గ‌న్నికి మ‌ద్ద‌తు ప‌లికారు. తొలుత భీమడోలు మండలం కురెళ్ళగూడేం నుంచి ర్యాలీగా బయలుదేరిన తెలుగుదేశం సైన్యానికి ఎమ్మెల్యే గ‌న్ని నేతృత్వం వ‌హించారు. తాను కూడా స్వ‌యంగా బైక్ న‌డుపుతూ.. యువ‌త‌ను ఉత్సాహ‌ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోఅమ‌ల‌వుతున్న ఆద‌ర‌ణ ప‌థ‌కం, పింఛ‌న్లు, వివిధ వర్గాల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే విధానం, బీసీ కార్పొరేష‌న్ ద్వారా జ‌రిగిన ల‌బ్ధి వంటివాటిని వివ‌రించారు. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన బీసీ వ‌ర్గ అభివృద్ధిని పేరు పేరునా ఆయ‌న వినిపించారు.

దీంతో ఈ స‌ద‌స్సుకు వ‌చ్చిన బీసీ వ‌ర్గం నాయ‌కులు ముగ్ధుల‌య్యారు. త‌మ ఓటు మ‌ళ్లీ గ‌న్ని కేన‌ని, టీడీపీ మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని నినాదాల‌తో హోరెత్తించారు. ఇక‌, ఈస‌ద‌స్సుకు.. గ‌న్నితో పాటు జిల్లాపార్టీ అధ్యక్షురాలు మరియు రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు, శాసనమండలి సభ్యులు మరియు ప్రభుత్వ విఫ్ అంగర రామ్మోహనరావు, జెడ్.పి.పి చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, ఎం.ఎల్.సి మంతెన వెంకట సత్యన్నారాయణరాజు(పాందువ్వ శ్రీను) హాజ‌రై.. గ‌న్నికి మ‌రింత స‌పోర్ట్‌గా నిలిచారు. దీంతో జ‌య‌హో బీసీ స‌ద‌స్సుపూర్తిస్థాయిలో స‌క్సెస్ రేటును సాధించింది.