వివేకా హత్యపై అతడిపై అనుమానాలు

వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో నమ్మలేని నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పులివెందులలోని స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే వివేకా శరీరంపై బలమైన గాయాలుండటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వైఎస్ కుటుంబసభ్యులు సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసులో సుధాకర్‌రెడ్డి జైలు శిక్ష అనుభవించాడు. మూడు నెలల కింద సత్ప్రవర్తన కింద కడప సెంట్రల్‌ జైలు నుంచి సుధాకర్‌రెడ్డి విడుదలయ్యాడు.1998 మే 23న రాజారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఇడుపులపాలయలోని వ్యవసాయక్షేత్రాన్ని చూసేందుకు తన అనుచరుతలతో కలిసి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ప్రత్యర్థులు దాడి చేసి ఆయన్ను హత్య చేశారు. రాజారెడ్డి హత్య కేసులో 13 మందికి అప్పటి ఉమ్మడి హైకోర్టు 2006లో జీవిత ఖైదు విధించింది. దోషులు సుప్రీం కోర్టుకు వెళ్లారు.

అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ ఏడాది టీడీపీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. విడుదలైన వారిలో సుధాకర్‌రెడ్డి కూడా ఉన్నాడు. రాజారెడ్డి హత్య కేసులో సుధాకర్‌రెడ్డి 8వ ముద్దాయిగా పోలీసులు కేసు నమోదు చేశారు.