రాజంపేట లో గెలుపెవరిది..?

రాజంపేట.. రాష్ట్రంలోనే సంక్లిష్టమైన లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒకటి. కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గంలో.. వ్యక్తుల ప్రాబల్యం, పార్టీల ప్రభావం, వాటికి సమాంతరంగా సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషిస్తాయి. సామాజికవర్గాల అండతో పాటు పుష్కల ఆర్థిక వనరులతో డీఏ సత్యప్రభ(టీడీపీ), పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి (వైసీపీ) బరిలోకి దిగారు. రెండు వర్గాలకు చెందిన వీరి పోరు రసవత్తరంగా మారింది.

రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంలో కడప జిల్లాకు చెందిన రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ సీట్లు.. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, మదనపల్లె సెగ్మెంట్లు ఉన్నాయి. టీడీపీ అభ్యర్థి సత్యప్రభ చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్‌ డీకే ఆదికేశవులునాయుడి సతీమణి. ఆమె పార్లమెంటుకు పోటీ చేయడం ఇదే తొలిసారి. గత ఎన్నికల్లో ఆమె చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. రాజకీయ నేపథ్యంతో పాటు సామాజిక, ఆధ్యాత్మిక సేవలందిస్తున్న కుటుంబం ఆమెది. కార్పొరేట్‌ ఆసుపత్రులతో పాటు మెడికల్‌, డెంటల్‌, ఇంజనీరింగ్‌, డిగ్రీ కళాశాలలు నిర్వహిస్తున్నారు. పలు పరిశ్రమలు, వ్యాపారాలు కూడా ఉన్నాయి. వైసీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి.. మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. కాంట్రాక్టరు.. అర్థబలం, అంగబలం దండిగా ఉన్నాయి. జనసేన నుంచి సయ్యద్‌ ముకరం చాంద్‌ పోటీచేస్తున్నారు.

బలిజలే అధికం
ఈ లోక్‌సభ స్థానం పరిధిలో సామాజికవర్గాలు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇక్కడ ఇప్పటి దాకా జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే.. తొలినాళ్లలో రెడ్ల ఆధిపత్యం కనిపిస్తుంది. 1957లో టీఎన్‌ విశ్వనాథరెడ్డి, 1962లో సీఎల్‌ నరసింహారెడ్డి గెలిచారు. తర్వాత 1967 మొదలుకుని 2009 వరకూ వరుసగా 12 ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు పోతురాజు పార్థసారథి (1967, 72, 77, 80), సుగవాసి పాలకొండ్రాయుడు (1984), ఎ.సాయిప్రతాప్‌ (1989, 91, 96, 98), గునిపాటి రామయ్య (1999), మళ్లీ సాయిప్రతాప్‌ (2004, 2009) గెలిచారు. గత ఎన్నికల్లో మిఽథున్‌రెడ్డి గెలుపొందారు. ఈసారి పోటీని ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇద్దరూ చిత్తూరు జిల్లావాసులే.

అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా ఓటర్లు
సెగ్మెంట్‌ ఓటర్లు
తంబళ్లపల్లె 209833
పీలేరు 223584
మదనపల్లె 246212
పుంగనూరు 229261
రాయచోటి 231637
రాజంపేట 222274
రైల్వే కోడూరు 182665
మొత్తం 1545446

సత్యప్రభ (టీడీపీ) సానుకూలతలు
పటిష్ఠమైన టీడీపీ కేడర్‌
బలమైన బలిజ సామాజిక వర్గం అండ.
దండిగా అంగ, అర్థబలం.
సామాజిక, ఆధ్యాత్మిక సేవలు
రాష్ట్రప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం

ప్రతికూలతలు..
ప్రజల్లోకి వెళ్లే చొరవ లేకపోవడం.
ప్రజాసంబంధాలు తక్కువ.

మిథున్‌రెడ్డి (వైసీపీ) సానుకూలతలు
ప్రజల్లోకి చొరవగా, దూకుడుగా వెళ్లడం
వైసీపీ శ్రేణులపై పట్టు..
అన్ని సెగ్మెంట్లలోనూ పార్టీ బలంగా ఉండడం.

ప్రతికూలతలు..
అభివృద్ధి పనుల్లో చొరవ లేకపోవడం.
చిన్నపాటి పనులు తప్ప చెప్పుకోదగిన అభివృద్ధి చేపట్టకపోవడం